నెహ్రూ, ఇందిరల్లాగా ఎందుకు చేయలేదు: బాబు
న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల విలీనం చేసినప్పుడు నెహ్రూ వ్యవహరించిన తీరులో గానీ, రెండు ప్రాంతాలను కలిపి ఉంచడానికి ఇందిరా గాంధీ చేసినట్లు గానీ ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ ఎందుకు చేయలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విలీనం సందర్భంలో నెహ్రూ హైదరాబాద్ వెళ్లి ఇరు ప్రాంతాలవారికి నచ్చజెప్పారని, 1972లో ఇందిరా గాంధీ వెళ్లి నచ్చజెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈసారి అలా ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ నిరాహార దీక్ష చేపట్టడానికి ముందు ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ధర్మంగా వ్యవహరించాలని, న్యాయం చేయాలని తాను అడుగుతున్నానని ఆయన అన్నారు. కాంగ్రెసు కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని సీమాంధ్రలో పరిస్థితులు రోజురోజుకూ విషమిస్తున్నాయని, సమస్యకు పరిష్కారం చూపకుండా కాంగ్రెసు మరింత జఠిలం చేస్తోందని ఆయన అన్నారు. సీమాంధ్రలో 70 రోజులుగా ఆందోళనలు జరుగుతుంటే కాంగ్రెసు ఒక్క విజ్ఞప్తి కూడా చేయలేదని ఆయన గుర్తు చేశారు.

సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడానికి బదులు కాంగ్రెసు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. విభజన కాంగ్రెసు అంతర్గత వ్యవహారం కాదని, సీమాంధ్ర ప్రజల జీవితాలతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం, తాత్కాలిక ఫలితాల కోసం కాంగ్రెసు ఇలా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన రహస్యం కాదని, అటువంటప్పుడు అన్ని విషయాలు ఎందుకు వెల్లడి చేయడం లేదని ఆయన అన్నారు. కేబినెట్ నోట్ సిద్ధం కాలేదని కేంద్ర హోం మంత్రి ఉదయం పూట చెప్పి సాయంత్రమే నోట్‌ను మంత్రివర్గం ముందు పెట్టారని ఆయన గుర్తు చేశారు. అలా ఎందుకు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
నెహ్రూ, సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ చెప్పిన మాటలను చంద్రబాబు ఉంటకిస్తూ ప్రజలను ఒప్పించి ఏ పనైనా చేయాలని అన్నారు. అలా కాకుండా తెలుగుదేశం పార్టీని లక్ష్యం చేసుకుంటాం, తెరాసను కలుపుకుంటాం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో లాలూచీ పడుతామంటే కుదరదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానం తీరును ఆ పార్టీ నాయకులే తప్పు పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు అడుగులు ముందుకేసే ముందు అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications