క్యాంపు కార్యాలయంగా.. చంద్రబాబు హైదరాబాద్ నివాసం, అసలెన్ని ఇళ్లు? ఎంత ఖర్చు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించుకున్న నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించుకున్న నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో ఆధునాతన సౌకర్యాలతో విలాసవంతంగా నిర్మించిన ఈ భవనంలోకి చంద్రబాబు నాయుడు ఇటీవలే గృహప్రవేశం చేశారు. మే 31వ తేదీతో జీవో నెంబర్ 68 ద్వారా రహదారులు, భవనాల శాఖ పేరిట తాజాగా ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

మొత్తం మూడు అధికారిక నివాసాలు..
ఎవరికైనా సాధారణంగా ఒకటి, లేదా రెండు నివాసాలు ఉంటాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు అధికారిక నివాసాలున్నాయి. అవును.. చంద్రబాబుకు హైదరాబాద్‌తో పాటు విజయవాడలోని కరకట్ట, సొంత ఊరు నారావారి పల్లెలోనూ అధికారిక నివాసాలు ఉన్నాయి. ఎన్ని ఇళ్లున్నా ఇబ్బందేమీ లేదు కానీ.. అధికారంలో ఉన్నాం కదా అని ఆ ఇళ్ల నిర్వహణ కోసం ప్రజాధనాన్ని ఖర్చుచేయొచ్చా?

నిర్వహణ భారం.. ప్రభుత్వానిదే
కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనాన్ని ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా మార్చడంతో.. ఇక భవన నిర్వహణ భారమంతా ఇప్పుడు ప్రభుత్వంపై పడనుంది. భవనానికి ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లకయ్యే ఖర్చులతో పాటు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందికయ్యే అన్ని రకాల వ్యయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించనుంది.

ఇంటి భద్రత మొదలుకొని...
ఇప్పటికే నిబంధనల ప్రకారం విజయవాడలోని సీఎం అధికారిక నివాసానికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఇటీవలే నిర్మించిన చంద్రబాబు నివాసాన్ని ఏపీ ప్రభుత్వంలోని రహదారులు, భవనాల శాఖ ఆయన క్యాంప్ కార్యాలయంగా మార్చేస్తూ జీవో కూడా ఇచ్చేసింది. దాని ప్రకారం హైదరాబాద్ ఇంటికి కూడా తగిన భద్రత కల్పించడం, ఇంట్లో పనిచేసే వ్యక్తిగత సహాయకులు, ఇతరుల అందరి జీతాలు, అందులోని మొక్కల నిర్వహణ.. ఇలాంటి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వ ఖాతాలోకే వెళ్లిపోతాయన్న మాట.

నారావారిపల్లె ఇంటికీ అంతే...
చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలోని చంద్రబాబు ఇంటికి కూడా ప్రభుత్వ ఖర్చుతోనే భద్రతతో పాటు లైటింగ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు అక్కడకు చంద్రబాబు కుటుంబ సమేతంగా వెళతారు. అయినాసరే, ఆయన సొంత ఇంటి భద్రత కోసం ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పవర్ ఫెన్స్, నెట్వర్క్ కమ్యూనికేషన్, సీసీ టీవీల ఏర్పాటుకు రూ.36 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జూరీ అయ్యాయి. గతంలోనూ రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు లేక్వ్యూ గెస్ట్హౌస్తో పాటుగా ఏపీ సచివాలయాల మార్పులు, చేర్పులపై కోట్ల రూపాయిలు ఖర్చు చేశారు.

పది కిలోమీటర్ల దూరానికే హెలీప్యాడ్...
అంతకుముందు కూడా ఒకసారి తన ఇంటి నుంచి మంగళగిరి.. అంటే పది కిలోమీటర్ల దూరం వెళ్లడానికి ప్రత్యేకంగా ఒక హెలీప్యాడ్ ఏర్పాటు చేయించుకున్నారు చంద్రబాబునాయుడు. దానికి అయిన ఖర్చు అక్షరాలా రూ. 26.34 లక్షలు. అంటే ఒక కిలోమీటరుకు రూ. 2.6 లక్షలు ఖర్చు పెట్టారన్న మాట. మరి మైకు పట్టుకుంటే చాలు.. తన అంత నిజాయితీపరుడు ప్రపంచంలోనే లేడని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు... తన సొంత ఇళ్లను ఇలా అధికారిక నివాసాలుగా మార్చేసి ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేయవచ్చా?












Click it and Unblock the Notifications