దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదు: బాబు, జగన్‌పై ఫైర్
విజయవాడ: తెలుగు ప్రజలు కలిసి ఉండాలనే బూర్గుల పదవీ త్యాగం చేశారని, కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిగా విభజన చేసిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. బెంజ్ సర్కిల్లో నవ నిర్మాణ దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీకి వెళ్లి నిరసన దీక్ష చేశామన్నారు.
తెలుగు ప్రజలకు ఓ రాష్ట్రం కావాలని ఆనాడు బూర్గుల రామకృష్ణ రావు సమైక్య ఏపీకోసం పదవి త్యాగం చేశారన్నారు. తెలుగు వారు అందరు కలిసి ఉండాలని నాడు ఉద్యమం చేశారని, అప్పుడు ఇందిరా గాంధీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి.. మీరు ప్రత్యేక రాష్ట్రం తప్ప ఏదైనా అడగాలని చెప్పారన్నారు.
తెలంగాణ, ఏపీలు బాగుండాలని అందరు కోరుకుంటున్నారన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ పార్టీ పెట్టారన్నారు. తెలుగువారు కలిసి ఉండాలనేది ఎన్టీఆర్ ఆకాంక్ష అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే ఏపీ ఏర్పడిందన్నారు. తెలుగు వారి కోసమే ఏపీ అన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటారని చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవించాలని చెప్పానని, అలాగే ఏపీ సమస్యలు తీర్చాలని తాను నాడు డిమాండ్ చేశానని చెప్పారు. అందుకే శ్రీకృష్ణ కమిటీని వేశారన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గుర్తించేందుకే విజయవాడలో నవ నిర్మాణ దీక్షను పెట్టామన్నారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమం జరిగినా పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేశారన్నారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందన్నారు. అక్కడ కాంగ్రెస్, ఇక్కడ వైసీపీ గెలవాలని భావించిందన్నారు.
తెరాసతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ పైన, తన పైన ఎన్నో అభాండాలు వేశారన్నారు. టీడీపీని కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారని ఆరోపణలు చేశారన్నారు. విభజన విషయంలో వైసీపీ, టీఆర్ఎస్‌లు లాలూచీ పడ్డాయన్నారు.
ఉద్రేకాలు రెచ్చగొట్టవద్దని, తెలుగు జాతి ఒకటి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సమన్యాయం జరగాలన్నారు. ఇటలీ స్వాతంత్ర్యోత్సవం రోజున ఏపీని విభజించారన్నారు. హేతుబద్ధత లేకుండా విభజించారని చాలాసార్లు చెప్పానని తెలిపారు.
విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క క్షణం కూడా ఆంధ్రప్రదేశ్ గురించి, ఇక్కడి ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్ ఏకపక్షంగా విభజన చేసిందన్నారు. టీడీపీ కృషి వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల కాలంలో ఏపీని దోపిడీ చేశారన్నారు.
కార్యకర్తల బలం ఉంటే కొండనైనా ఢీకొంటానని చెప్పారు. తనకు మతం, కులం లేదని చెప్పారు. నవ నిర్మాణ దీక్ష తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదని, ఏపీ ప్రజల ఆకాంక్షను చెప్పేందుకే అన్నారు. రాష్ట్ర విభజన వెనుక కుట్ర దాగి ఉందన్నారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధే తన ఆకాంక్ష అన్నారు.
1994-2004 మధ్య ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చానని చెప్పారు. హైదరాబాదును ప్రపంచపటంలో నిలిపానన్నారు. వైసీపీ, తెరాస లాలూచీ పడి రాజకీయ లబ్ధి పొందగా, సోనియా గాంధీ భంగపడ్డారన్నారు. జగన్‌కు బెయిల్ ఇప్పించారన్నారు. మూడు పార్టీల నాటకంతో ఏపీ అతలాకుతలం అయిందన్నారు.
రాజధాని నిర్మాణానికి రూ.5 లక్షల కోట్లు కావాలంటే తనను ఎగతాళి చేశారని, తనది రెండుకళ్ల సిద్ధాంతమని చెప్పినప్పటికీ ఎగతాళి చేశారన్నారు. తెలంగాణలో సమస్యల పైన రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు. విపక్ష ఎమ్మెల్యేలను తెరాస కొనుగోలు చేస్తోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో అభివృద్ధి సాధ్యమన్నారు.
గన్నవరంలో టెర్మినల్ ప్రారంభించిన చంద్రబాబు
రాజమండ్రి విమానాశ్రయం అభివృద్ధి చేస్తామన్నారు. విజయవాడ, విశాఖ తిరుపతి విమానాశ్రయాలను కేంద్రం సహకారంతో అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. కొందరు రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అది సరికాదన్నారు.
గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబు కొత్త టెర్మినల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది మరో టెర్నినల్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇతర దేశాలతో కనెక్టివిటీ చేస్తున్నామన్నారు. నాలుగు ఎయిర్ పోర్టుల అభివృద్ధికి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.
గన్నవరం టెర్మినల్‌తో దుబాయ్, సింగపూర్, హాంకాంగ్, మలేషియా వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. పుష్కరాలకు రాజమండ్రి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దగదర్తి, నెల్లూరు, కుప్పం, ఓర్వకల్లులో కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామన్నారు.












Click it and Unblock the Notifications