చంద్రబాబు Vs జగన్: అమరావతి భూదందా నుంచి ఆస్తుల దాకా
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి చుట్టూ మంత్రుల భూములు కొనుగోలు చేసిన వ్యవహారంపై బుధవారం శాసనసభ అట్టుడికింది. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది. రాజధాని భూముల కోనుగోల విషయంలో అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పరస్పరం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. దీంతో గవర్నర్ ప్రసంగంపై జరగాల్సిన చర్చ అర్ధాంతరంగా ముగిసింది. రాజధాని భూముల విషయంలో వైయస్ జగన్ పైచేయి సాధించారా? లేక అధికారపక్షమే కావాలని చర్చను అర్ధాంతరంగా ముగించిందా? జగన్ ఆరోపణలు, టీడీపీ నేతల ప్రత్యారోపణల మధ్య ఉదయం నుంచి సభ వాడివేడిగా సాగింది. మధ్యాహ్నాం సమయంలో సభలో జగన్, చంద్రబాబు వ్యక్తిగత ఆస్తులవైపుకి మళ్లింది.
ఆ తర్వాత రాజధాని భూముల కొనుగోలుపై వాడివేడిగా సాగింది. భూముల కొనుగోలు విషయంలో మంత్రులపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే డిస్మిస్ చేస్తనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసరారు. అదే ఆరోపణలు నిరూపించకపోతే సభలో క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో సభలో వాతావరణం వేడేక్కింది.
ఈ క్రమంలో రాజధాని భూముల క్రయవిక్రయాలపై వైయస్ జగన్ సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'సీబీఐ కాదు ఏ విచారణా వేయం' అని పేర్కొన్నారు. సీబీఐతో దర్యాప్తు చేయిస్తే ప్రజల్లో అపోహలు వస్తాయని అన్నారు.
ఇలా రాజధాని భూములపై చర్చకు మరింత సమయం కేటాయిస్తే రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రయోజనకరం కాదని చంద్రబాబు అనుకున్నారో ఏమో రాజధాని భూముల చర్చకు తెరదించారు. శాసనసభాపక్ష మంత్రి యనమల రామకృష్ణుడు రంగంలోకి అసెంబ్లీలోని రూల్ 329ను ఉపయోగించారు.

ఈ రూల్ ప్రకారం రాజధాని భూముల కొనుగోలు చర్చను ముగించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ సభలో చర్చ తప్పుతోవ పట్టిందన్నారు. సభలో చర్చ తప్పుదోవ పట్టినప్పుడు రూల్ 329 ప్రకారం ముగింపు పలకాల్సిన అవసం ఉందన్నారు.
చర్చ ఎక్కువసేపు జరుగుతుందని తెలిసినప్పుడు దానిని ముగించేందుకు రూల్ 329ని ఉపయోగించామన్నారు. చర్చను అర్దాంతరంగా ముగించే అధికారం సభకు ఉందన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి సమాధానం ఉంటుందని అన్నారు. దీంతో వైసీపీ సభ్యులు సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చి 'రాజధాని భూములపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి' అంటూ నినాదాలు చేశారు.
నినాదాలు చేసే సభ్యులు తక్షణం తమ సీట్లలో కూర్చోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని యనమల హెచ్చరించారు. దీంతో సభలో కొంత టెన్షన్ నెలకొంది. సభలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్చలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. దీంతో వైసీపీకి సభ్యులను సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు రాజధాని చుట్టుపక్కల గ్రామాల్లో టీడీపీ నేతలు, వారి బినామీలు భూములను కొనుగోలు చేసిన వ్యవహారంపై జగన్ చేసిన ఆరోపణలపై అసెంబ్లీలో చంద్రబాబు ఒకింత తగ్గినట్లే కనిపించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు విషయంలో తన వాళ్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా చంద్రబాబు అఫీషియల్ ఓత్ ఆఫ్ సీక్రసీ ఉల్లంఘించారన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించాలని ప్రతిపక్ష నేత జగన్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అధికార రహస్యాలను కాపాడుతానని ప్రమాణం చేసిన చంద్రబాబు ఆ రహస్యాలను కాపాడకుండా ఉల్లంఘించారని, ఈ వ్యవహారంలో ఆయనే దోషి అయినందున మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు.
ఏవైనా అక్రమాలు, అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం శాసనసభలో ఆరోపణలు చేసినప్పుడు దానిపై ప్రభుత్వం సమగ్రమైన వివరణ ఇస్తుంది. లేదంటే విచారణకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే బుధవారం అసెంబ్లీలో చంద్రబాబు విచారణకు సిద్ధమని ప్రకటించకుండా అందుకు భిన్నంగా మాట్లాడారు.
ముఖ్యమంత్రి ప్రతిపక్షం చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వకపోగా మంత్రులు కొనుగోలు చేసినట్టు చెబుతున్న భూముల సర్వే నంబర్లు ఇప్పటికిప్పుడు సభలో ఇవ్వాలి. లేదంటే జగన్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అప్పటివరకు సభ జరగడానికి వీలులేదంటూ చంద్రబాబు భీష్మించారు.












Click it and Unblock the Notifications