పీఏపై చేయి, బాలకృష్ణపై బాబు సీరియస్!: అనాథగా...
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఆయన సీరియస్ అయ్యారు. రామకుప్పంలో హెలిప్యాడ్ వద్ద చంద్రబాబు పీఏ పైన పోలీసులు చేయి చేసుకున్నారని సమాచారం. దీంతో టిడిపి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. జరిగిన ఘటన గురించి తెలుసుకున్న చంద్రబాబు డిఐజి బాలకృష్ణపై సీరియస్ అయ్యారట. సంబంధింత పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చిత్తూరు చేరుకున్న చంద్రబాబు మాట్లాడుతూ... తాము హామీలను కచ్చితంగా నెరవేర్చుతామని చెప్పారు. ఇచ్చిన హామీల పైన వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పారు. ప్రస్తుతం అనాథగా ఉన్న రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తామని చెప్పారు. నీరు - మీరు లాంటి కార్యక్రమాల ద్వారా భూగర్భ నీటి మట్టాన్ని పెంచుతామని, కరువును పారద్రోలుతామని ఆయన చెప్పారు.

రాష్ట్రాభివృద్ధికి 24 గంటలు కష్టపడతానని చెప్పారు. కొత్త రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయన్నారు. జీతాలివ్వడానికి కూడా డబ్బులు లేవన్నారు. ఇంతవరకు రాజధానిని ఎక్కడ నిర్మిస్తారో కూడా తెలియదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సమకారంతో ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రబాబు సోమవారం కుప్పంలో పర్యటిస్తున్నారు.
ముఖ్యమంత్రి పదవి పూల కిరీటం కాదని, ముళ్ల కిరీటమన్నారు. ఖాళీ ఖజానా ఇచ్చారని, జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరి సహకారం, ఆశీస్సులు కావాలన్నారు. నవ్యాంధ్ర నిర్మాణమే తమ లక్ష్యమన్నారు. ఇచ్చిన హామీ మేరకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చూస్తానని చెప్పారు. విభజనలో ఆంధ్రకు అన్యాయం జరిగిందన్నారు. విభజనలో ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిఎం కిరీటం ముళ్ల వంటిదన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణానికి అహర్నిషలు కృషి చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications