భ్రమలు వద్దు, మీరే నష్టపోతారు.. మారకపోతే వేరే నాయకత్వమే: బాబు హెచ్చరిక

Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఎన్నికల వాతావరణానికి ఇప్పటినుంచే పార్టీని అప్రమత్తం చేసే పనిలో పడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పార్టీలో ఎవరి స్థానం పదిలం కాదంటూ? పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. పనితీరు సరిగా లేని నేతల విషయంలో ఎలాంటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడేది లేదనే సంకేతాలు పంపించారు.

మంగళవారం ఉండవల్లిలోని అధికారిక నివాసంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో నేతల పనితీరును ఆయన సమీక్షించారు. కార్యకర్తలను కలుపుకుని పోవాలని, పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించవద్దని సూచించారు.

పదిలం అనుకోకండి:

పదిలం అనుకోకండి:

పార్టీలో కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారు. వైఖరి మార్చుకోకపోతే పార్టీ ఎలాంటి నిర్ణయానికైనా వెనుకాడదన్నారు. 'పార్టీలో మా స్థానం పదిలం అనుకుని కూర్చోకండి..' అంటూ హెచ్చరించారు. ప్రజల్లో విశ్వసనీయత ఏర్పరుచుకుంటేనే ప్రజలు నాయకుల వైపు నిలుస్తారని తెలిపారు.

 ఆ విషయం మరిచిపోవద్దు:

ఆ విషయం మరిచిపోవద్దు:

ప్రజల్లో విశ్వసనీయత సడలితే పార్టీకి ప్రతికూలతలు ఎదురవుతాయని, కాబట్టి అలసత్వంగా వ్యవహరించే నేతలను సహించేది లేదని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

లేనిపక్షంలో సదరు నేతలను ఇంటికి పంపించేందుకైనా సిద్దమని అన్నారు. నేతల కోసం పార్టీని తాకట్టు పెట్టలేనని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో 1. 6 శాతం ఉన్న ఓట్ల తేడా నంద్యాల ఉపఎన్నికల నాటికి 16 శాతానికి పెరిగిందని గుర్తుచేశారు. ఈ విషయాన్ని మరిచిపోవద్దని నేతలకు చంద్రబాబు సూచించారు.

 భ్రమలు వద్దు:

భ్రమలు వద్దు:

వీడియో కాన్ఫరెన్స్ కు డుమ్మా కొట్టిన నేతలపై, ఆలస్యంగా వచ్చిన నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగైదు సార్లు గెలిచాం కదా.. ఇక తిరుగలేదనుకుంటే కుదరదని, అదంతా భ్రమే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి భ్రమల్లో ఉంటే మీరే నష్టపోతారని హెచ్చరించారు. మీ స్థానంలో మరో నాయకత్వాన్ని తయారుచేసుకోవాల్సి వస్తుందని మందలించారు. దీంతో కొంతమంది నాయకుల్లో గుబులు మొదలైనట్లుగా తెలుస్తోంది.

ఆ మాటతో గప్‌చుప్:

ఆ మాటతో గప్‌చుప్:

వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కొంతమంది నేతలు రహదారుల నిర్మాణం, గ్రావెల్ రోడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. దీంతో చంద్రబాబు వారికి చురకలంటించారు. ముందు డబ్బు వచ్చే మార్గం చెప్పి.. ఆ తర్వాత నిధులు అడగండి అన్నారు. ఇక తమ జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామని ఓ నాయకుడు చెప్పగా.. అంత అనుకూల వాతావరణం ఉంటే ఇంటింటికి తెలుగుదేశంలో మీ జిల్లా నేతలకు బి-గ్రేడ్ లు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు.

 మంచి అవకాశం, నేతల్లో మార్పు:

మంచి అవకాశం, నేతల్లో మార్పు:

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మంచి అవకాశమని, ఎన్నికల సమయంలోను అందరి ఇళ్లకు వెళ్లలేరని, కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. బి గ్రేడ్ తెచ్చుకున్న నాయకులంతా మున్ముందు ఏ గ్రేడ్ తెచ్చుకునేలా ప్రయత్నించాలన్నారు.

అధినేత మాటలను సీరియస్ గా తీసుకున్న కొంతమంది నేతలు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ట్యాబ్‌లను చేతబట్టి, టెక్నికల్ టీమ్‌ను వెంటబెట్టుకుని మరీ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu conducted a review meeting through video conference over TDP programs

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి