అమెరికాని మించుతాం: చైనాలో బాబు ఆకర్షకమంత్రం
జింగ్: అమెరికాను మించిపోయే శక్తి భారత్, చైనాలకు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళారం అన్నారు. చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు బీజింగ్‌లో వ్యాపారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపార అవకాశాలపైన వారికి వివరించారు.
చంద్రబాబు మాట్లాడుతూ... భారత్‌లో నరేంద్ర మోడీకి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని చెప్పారు. ప్రపంచంలోనే పెద్ద మార్కెట్ భారత దేశంలో ఉందన్నారు. ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత చైనా అభివృద్ధి చెందిందని, భారత్ కూడా చైనా బాటలోనే సంస్కరణలు చేపట్టబోతోందన్నారు.
మోడీ నాయకత్వంలో భారత్ ముందుకు పోతోందన్నారు. దేశ నాయకత్వంపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారన్నారు. చైనా, భారత్‌లు అగ్రరాజ్యాలుగా అవతరిస్తాయని చెప్పారు. రాబోయే మూడు నాలుగు దశాలు భారత్‌వే అన్నారు.

అమెరికాను మించి పోయే శక్తి భారత్, చైనాలకు ఉందన్నారు. భారత్ రెండు అంకెల వృద్ధి రేటు సాధిస్తుందన్నారు. ఇంగ్లీషు మాట్లాడే వారి సంఖ్య భారత్‌లో బాగా పెరిగిందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక చైనాతో సంబంధాలు మెరుగయ్యాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొడవైన తీర ప్రాంతముందని చెప్పారు. ఏపీలో 974 కిలోమీటర్ల మేర తీర ప్రాంతముందని చెప్పారు. దేశాన్ని పాలిస్తున్న ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ కీలకమని చెప్పారు. విశాలమైన తీరప్రాంతం, అపార ఖనిజ వనరులున్నాయని వాటితో పరిశ్రమలు స్థాపించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయన్నారు. ఓడ రేవులు, అమరావతి రాజధాని ప్రాంతం, తిరుపతి, నెల్లూరు పారిశ్రామికవాడలున్నాయని వివరించారు.












Click it and Unblock the Notifications