రాజ్యసభ-ఉత్తరాఖండ్: బాబుకు జగన్ షాకిచ్చేనా, విజయసాయి సేఫ్!
విజయవాడ: వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశలు నెరవేరే అవకాశం లేదా? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. నాలుగు స్థానాలను తామే (బిజెపి - టిడిపి మిత్రపక్షం) కైవసం చేసుకోవాలని చంద్రబాబు ఉవ్వీళ్లూరుతున్నారు. అసెంబ్లీలో ఉన్న బలం ప్రకారం టిడిపికి మూడు, వైసిపికి ఒక సీటు దక్కనుంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ టిక్కెట్ ఎవరికి దక్కుతుందనేది దాదాపు ఖాయమైపోయింది. జగన్ పార్టీ నేత విజయ సాయి రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. విజయ సాయి పేరు అనధికారికంగా ఖాయమైపోయింది కూడా.
అయితే, జగన్‌కు దక్కనున్న ఆ నాలుగో స్థానాన్ని కూడా వైసిపికి దక్కనివ్వవద్దని టిడిపి మొదటి నుంచి భావిస్తోంది. విజయ సాయి రెడ్డి గెలుపును ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించుకుంది.
ఇదే సమయంలో పలువురు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటి దాకా పదిహేడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. మరికొందరు కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
గత ఎన్నికల్లో వైసిపి 67 స్థానాలు దక్కించుకుంది. ప్రస్తుతం అటు ఇటుగా 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు మరో పదిమంది వెళ్లిపోయినా జగన్‌కు వచ్చే నష్టం లేదు. మరో పదిమంది పోయినా విజయ సాయి రెడ్డి గెలవగలరు.
అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వైసిపి నుంచి టిడిపిలోకి వెళ్లేందుకు మరింత మంది ఆసక్తి కనబర్చినట్లుగా కనిపించడం లేదు. కొందరు వెళ్లినా రాజ్యసభ ఎన్నికల నాటికి వైసిపికి అవసరమయ్యే బలంలో మాత్రం తేడా ఉండే అవకాశం లేదని అంటున్నారు.

విజయ సాయి రెడ్డి కచ్చితంగా రాజ్యసభకు వెళ్తారని వైసిపి బలంగా విశ్వసిస్తోంది. జగన్ తరఫున విజయ సాయి గెలవకుండా చేయాలంటే వైసిపి నుంచి మరో పదిహేను మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించవలసి ఉంటుంది. కానీ ఆ అవకాశాలు సన్నగిల్లాయని అంటున్నారు.
ఎమ్మెల్యేల చేరిక కాకుండా జగన్‌ను దెబ్బ తీసేందుకు చంద్రబాబుకు రెండో అవకాశం కూడా ఉందనే వాదనలు వినిపించాయి. రాజ్యసభ ఎన్నికల్లో విప్ వర్తించదు. కాబట్టి వైసిపి ఎమ్మెల్యేలు పార్టీ మారకుండానే జగన్ నిలబెట్టిన వ్యక్తికి కాకుండా టిడిపి వ్యక్తికి మద్దతిచ్చినా వారికి నష్టం ఉండదనే వాదన విన్పించింది.
అయితే, ఉత్తరాఖండ్ ప్రభావం కనిపించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఉత్తరాఖండ్‌లో ఫిరాయింపుదారులకు ఓటు హక్కు లేదని సుప్రీం తీర్పునివ్వడంతో అధికార బీజేపికి గట్టి దెబ్బ తగిలింది.
ఇక్కడి ఫిరాయింపుల పైన కూడా ఆ ప్రభావం కనిపించే ఆస్కారం ఉంటుందనే అభిప్రాయంతోనే జగన్ ఫిరాయింపుదారులపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. జగన్ స్పీకర్ నిర్ణయాధికారాన్ని సుప్రీం తన చేతుల్లోకి తీసుకోవాలని ఈసారి కోరలేదు.
ఫిరాయింపులపై సభాపతికి ఫిర్యాదులు చేశామని, వారికి తమ పార్టీ నుంచి ఫిరాయించారని ఆధారాలు సమర్పించామని, కాని ఆయన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని, కాబట్టి త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వారికి ఓటు వేసే అవకాశం ఇవ్వద్దని వైసిపి సుప్రీం కోర్టును కోరింది.
స్పీకర్ జాప్యం చేసినా, పక్షపాతంతో చర్యలు తీసుకున్నా న్యాయసమీక్ష చేసే అధికారం సుప్రీంకు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కల్పించింది. దీని ఆధారంగానే సుప్రీం ఉత్తరాఖండ్ విషయంలో ఫిరాయింపుదారులపై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వారికి ఓటు హక్కు ఉండదని తీర్పునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లోను దాదాపు అదే పరిస్థితి ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేకుండా చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చే అవకాశాల పైన చర్చ సాగుతోంది. అదే జరిగితే చంద్రబాబు ఆశించినట్లుగా నాలుగు సీట్లు కైవసం చేసుకోవాలన్న టిడిపి ఆశలు ఆడియాసలు కానున్నాయి. అదేవిధంగా భవిష్యత్తులో తమ పైనా వేటు పడుతుందనే భయంతో ఫిరాయింపులు కూడా తగ్గే అవకాశముంది.












Click it and Unblock the Notifications