కుప్పంలో భారీ ర్యాలీతో చంద్రబాబు నామినేషన్ వేసిన భువనేశ్వరి.. ఏమన్నారంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఏపీలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అన్ని పార్టీలు ఒకపక్క ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూనే మరోవైపు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. నేడు టిడిపి అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు.
చంద్రబాబు నామినేషన్ పత్రాలకు భువనేశ్వరి పూజలు, ప్రార్ధనలు
నామినేషన్ దాఖలుకు ముందు భువనేశ్వరి శుక్రవారం ఉదయం ఆలయం, మసీదు, చర్చిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించారు. కుప్పంలోని స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలకు భువనేశ్వరి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురం లో ఉన్న మసీదు ఆవరణలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత బాబు నగర్ లో ఉన్న చర్చిలో భువనేశ్వరి ప్రార్థనలు నిర్వహించారు.

కుప్పంలో భువనేశ్వరి భారీ ర్యాలీ
నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళిన భువనేశ్వరి కుప్పంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమిలోని బిజెపి, జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో జోష్ తో పాల్గొన్నారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఇక నామినేషన్ ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన భువనేశ్వరి వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనం అయ్యింది : భువనేశ్వరి
ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయింది అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిశలు శ్రమించారని పేర్కొన్నారు. ఆయన రాత్రింబవళ్ళు కష్టపడ్డారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని అన్నారు. చంద్రబాబు హయాంలో చాలా మంది పెట్టుబడులు పెట్టటం కోసం ముందుకు వచ్చారని, కానీ ఇప్పుడు పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా పోయాయని భువనేశ్వరి పేర్కొన్నారు.
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గారి తరపున నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో, భువనమ్మకి మద్దతుగా తరలి వచ్చిన కుప్పం ప్రజలు#BabuForJanaRajyam#NaraBhuvaneshwari #NaraChandrababuNaidu #TDPJSPBJPWinning #kuppam #AndhraPradesh pic.twitter.com/6UgRXdn7ib
— Telugu Desam Party (@JaiTDP) April 19, 2024
రాక్షస పాలన అంతం చెయ్యండి: భువనేశ్వరి
వైసిపి పాలనలో టిడిపి కార్యకర్తలను తీవ్రంగా వేధించారని, రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలనను ఓటు అనే ఆయుధంతో అంతం చేయాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. అందరం కలిసి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొద్దామని చెప్పారు నారా భువనేశ్వరి.












Click it and Unblock the Notifications