వాస్తు దోషం: హెచ్ సౌత్ బ్లాక్‌పై చంద్రబాబు అనాసక్తి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిఎం ఛాంబర్‌గా హెచ్ సౌత్ బ్లాకును ఇష్టపడటం లేదట! ఈ బ్లాకు ఆగ్నేయంలో ఉండడంతో వాస్తు దోషముంటుందని పండితులు ఆయనకు సూచించినట్లుగా సమాచారం. దీంతో చంద్రబాబు తనకు ఆ బ్లాకు వద్దని చెప్పడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారట.
ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి సిఎం బ్లాకులు, సచివాలయ బ్లాకులు, అతిథి గృహాలు, ఇతర కార్యాలయ భవనాల ఎంపిక పూర్తయి, వాటి కేటాయింపులకు సంబంధించి గవర్నర్ ఆమోదం కూడా తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా మరో దానిని ఎంపిక చేశారు.

చంద్రబాబు నుంచి తమకు సమాచారం అందడంతో తాత్కాలికంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను పరిశీలించి, దీనిని ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఇంటికి నైరుతిలో ఉండాలన్న వాస్తు ప్రకారం రాష్ట్రానికి అధిపతిగా ఉండే సిఎం కూడా నైరుతిలోనే ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఎంకు కేటాయించిన హెచ్ సౌత్ బ్లాకు వాస్తు ప్రకారం ఆగ్నేయంలో ఉంది. ఇది ఎంతమాత్రం మంచిది కాదని పండితులు బాబుకు సూచించారని, దీంతో ఆయన దానిని ఇష్టపడడం లేదట.
వాస్తును ఎక్కువగా పట్టించుకునే చంద్రబాబు గతంలో పండితుల సూచనల మేరకే సచివాలయంలో పాత ప్రధాన ద్వారాన్ని కాదని కొత్తది ఏర్పాటు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హెచ్ సౌత్ బ్లాకును ఆయన వద్దంటున్నారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఛాంబర్ కోసం హెచ్ సౌత్ బ్లాకును ఎంపిక చేసిన అధికారులు.. ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు నుంచే దానికి హంగులు, ఆర్భాటాలు చేపట్టారు. రాష్ట్రపతి అపాయింటెడ్ డే నాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇందులోకి వచ్చేందుకు అంతా సిద్ధం చేయాలని నిర్ణయించి ఆ ప్రకారం పనులు చేపట్టారు. ఇవి ఇప్పుడిప్పుడే వేగవంతమవుతున్నాయి. దీని కోసం కొంత నిధులు కూడా ఖర్చు చేశారు.
ఈ సమయంలో చంద్రబాబు నుంచి ఈ బ్లాకు వద్దని సమచారం రావడంతో ఖర్చు పెట్టిన మొత్తం వృథాయేనని.. హంగులు అనవసరంగా చేశామని వాపోతున్నారట. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థను ఎంపిక చేయాలన్న యత్నాలలో అధికారులు ఉండగా.. దీనిని సచివాలయ ఉద్యోగులు ఇష్టపడడం లేదని సమాచారం. ఉద్యోగులలో ఎక్కువ శాతం వనస్థలిపురం, మలక్‌పేట్‌ల నుంచి రావాల్సి ఉండడంతో వారు విముఖత ప్రదర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications