ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు..! 25 వివరాలతో..! సీఎం ఆదేశం..!
ఏపీలో ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటి లబ్దిదారుల్ని మాత్రం ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్చుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. అలాగే వారి ఆధార్ తో పాటు ఇతర వివరాలు కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు శాశ్వతంగా ఉండేలా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేసేందుకు కూటమి సర్కార్ సిద్దమవుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రతీ కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సూచించారు. సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అందిస్తున్న పౌర సేవల్ని, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు.

రియల్ టైమ్ గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలన్నారు. 25 రకాల వివరాలతో పాటు పీ4 లాంటి అంశాలను అందులో చేర్చాలని సీఎం అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలన్నారు. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలన్నారు.

వాక్సినేషన్, ఆధార్, ఎఫ్‌బీఎంఎస్ ఐడీ, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు , స్కాలర్‌షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలని సీఎం అన్నారు. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ ఎఫ్‌బీఎంఎస్ వ్యవస్థను పరిమితం చేయొద్దని, పౌరులకు చెందిన అన్ని వివరాలనూ నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. కొన్ని పథకాలకు లబ్దిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లు కూడా ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయని అన్నారు.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం సూచనలు ఇచ్చారు. ఫ్యామిలీ కార్డును స్మార్ట్ కార్డుగా జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల్ని, పథకాలను అందేలా చూడాలని స్పష్టం చేశారు. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి జూన్‌లోగా కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.












Click it and Unblock the Notifications