గూగుల్ డేటా సెంటర్ రాకుండా వైసీపీ ? చంద్రబాబు సీరియస్..!
ఏపీలో ఓవైపు అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం జరిగింది. మరోవైపు విశాఖను ఐటీ కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చంద్రబాబు సర్కార్ పావులు కదుపుతోంది. ఇలాంటి సమయంలో ఒకప్పుడు విశాఖను రాజధానిగా చేసేందుకు విఫలయత్నం చేసిన వైసీపీ కొత్త కుట్రలకు తెరలేపిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖకు వచ్చేందుకు అంగీకరించిన గూగుల్ డేటా సెంటర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు చెప్తున్నారు.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు కోర్టుల్లో తప్పుడు కేసులు దాఖలు చేస్తున్నారని ఇవాళ నగరానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే డేటా సెంటర్ ఏర్పాటు పనుల్ని, స్థానిక రైతుల అభిప్రాయాల్ని కూడా సీఎంకు వారు వివరించారు. అదే సమయంలో వైసీపీ పెద్దల తరఫున విశాఖలో ఓ బినామీ ఈ డేటా సెంటర్ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.

ఇందులో భాగంగా రైతుల పేర్లతో వారికి తెలియకుండా కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తున్నారని, ఇందులో చనిపోయిన రైతులు కూడా ఉన్నారని టీడీపీ నేతలు చంద్రబాబుకు తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఇలా రైతుల పేరుతో తప్పుడు కేసులు దాఖలు చేస్తున్న వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని త్వరగా పరిష్కరించాలని కూడా ఆదేశించారు.

గూగుల్ డేటా సెంటర్ కోసం విశాఖలో జరుగుతున్న భూసేకరణపై స్పందిస్తూ.. ఓసారి పరిహారం ప్రకటించాక దాన్ని పెంచిన సందర్భాలు ఎక్కడా లేవని చంద్రబాబు తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కోసమే తాము ఈ నిర్ణయం ప్రత్యేకంగా తీసుకున్నట్లు నేతలకు చెప్పారు. కాబట్టి భూసేకరణను త్వరగా పూర్తి చేసి డేటా సెంటర్ పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications