దుష్పచారం తగదు: పేరంట్స్, ఎన్టీఆర్ దంపతులకు పిండ ప్రదానం చేసిన బాబు
అమరావతి: కృష్ణా పుష్కరాల్లో రెండో రోజైన శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పూర్వీకులకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయుడులతో పాటు, అత్తమామలు ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు ఆయన పిండ ప్రదానం చేశారు.
ఈ పిండ ప్రదాన కార్యక్రమం సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రార్థించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా పుష్కరాల విధి నిర్వహణలో అలక్ష్యం ఉండకూడదని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
పుష్కర స్నానానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు హోంగార్డులు సాయపడాలని, గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పవిత్ర భావనతో పుష్కరాల ఏర్పాట్లు చేస్తున్నందున, వచ్చిన యాత్రికులు అందరినీ సంతృప్తిగా పంపాలని స్పష్టం చేశారు. ప్రతిఘాట్ వద్ద వాటర్‌లెవల్ ఇండికేటర్లు ఉపయోగించాలన్నారు.

నీటిమట్టం లోతు అందరికీ తెలిస్తేనే స్నానానికి ఘాట్‌లో దిగే భక్తులు అప్రమత్తంగా ఉంటారని ఆయన తెలిపారు. వరుస సెలవులు నేపథ్యంలో రెండో రోజు రద్దీ పెరిగిందని, మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మరోవైపు కృష్ణా పుష్కరాలపై దుష్ప్రచారం తగదని ఆయన అన్నారు.
కృష్ణా పుష్కరాలపై మీడియా బాధ్యతారాహిత్యంగా వార్తలు రాయొద్దని, అలా రాస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పుష్కరాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కృష్ణా జలాలు కలుషితమయ్యే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా సైతం పుష్కరాలపై వస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని ఆయన కోరారు. స్వామీజీలు, పీఠాధిపతులు శనివారం కూడా పుష్కరస్నానం చేసిన విషయం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications