అమరావతి పరిధి పెంపు ? ఆ పన్నుఊరట..! రైతులకు చంద్రబాబు హామీ..!
ఏపీ రాజధాని అమరావతిపై కూటమి సర్కార్ వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే అక్కడ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ఆదేశాలు ఇస్తున్న సీఎం చంద్రబాబు.. రాజధానికి భూములిచ్చిన రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మరోసారి అమరావతి రైతులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇందులో కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.
అమరావతి రైతుల ప్రతినిధులు 80 మందితో ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇందులో పలు విషయాలను రైతులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఇప్పటికే రాజధాని రైతు సమస్యల పరిష్కారం కోసం నియమించిన కమిటీ వాటిని చూసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే కీలకమైన కోర్ క్యాపిటల్ పరిధి పెంపుకు రైతులు సహకరించాలని చంద్రబాబు వారిని కోరారు. ప్రస్తుతం 29 గ్రామాల్లో ఉన్న కోర్ క్యాపిటల్ పరిధి విస్తరించకపోతే అదో మున్సిపాలిటీలా మిగిలిపోతుందని మరోసారి వారికి గుర్తుచేశారు.

అలాగే రాజధాని రైతులకు వారు భూములిచ్చిన సమయంలో కేంద్రం మూలధన పన్ను (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) మినహాయింపు ఇచ్చేలా ఒప్పించారు. దీంతో రైతులకు ఊరట లభించింది. అయితే దాని గడువు ముగుస్తుండటంతో మరో రెండేళ్ల పాటు ఈ మినహాయింపును పొడిగించాలని రైతులు కోరుతున్నారు. దీనిపై రేపు అమరావతికి వస్తున్న కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ను కోరతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మరోవైపు రాజధాని అభివృద్ధి కోసం తాను తీసుకుంటున్న నిర్ణయాలకు రైతులు అండగా నిలవాలని చంద్రబాబు వారిని కోరారు. రాజధానికి భూములిచ్చిన రైతులుగా వారిపై తనకు అభిమానం ఉందని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా తమపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా చంద్రబాబు సరేనన్నారు. వీటితో పాటు రిటర్నబుల్ ఫ్లాట్ల కేటాయింపు, వాటి రిజిస్ట్రేషన్ల వంటి అంశాలపైనా రైతులు చంద్రబాబుతో చర్చించారు.












Click it and Unblock the Notifications