బాబుపై రోజా ఫైర్, కెసిఆర్ భేష్: ఎపి సిఎంకు రఘువీరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి శాసన సభ్యురాలు రోజా మంగళవారం మండిపడ్డారు. చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన తీరు పరనింద, ఆత్మస్తుతిలా ఉందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ శిక్షణా శిబిరాలలో చెప్పే మాటలను ఆయన సభలో చెప్పారని ఎద్దేవా చేశారు.
తొమ్మిది ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు రుణమాఫీ పైన కమిటీ వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీని సొంతం చేసుకోవడమే కాకుండా.. ఆయన ఆశయాలను కూడా ముఖ్యమంత్రి నెరవేర్చాలన్నారు.

ఆదర్శ రైతును కొనసాగించాలి: రఘువీరా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను కొనసాగించాలని ఎపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి వేరుగా డిమాండ్ చేశారు. ఆయన ఇందిరా భవన్ వద్ద ఎపి స్టేట్ ఆదర్శ రైతుల సంఘం భారీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడారు.
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. చంద్రబాబు తొలి నిర్ణయంతోనే రైతు వ్యతిరేకి అని నిరూపించుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఆదర్శ రైతు వ్యవస్థను కొనసాగించడమే కాకుండా వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. అది అభినందనీయమన్నారు.












Click it and Unblock the Notifications