జనసేన ఎమ్మెల్యేకు చంద్రబాబు ఊహించని షాక్- "అన్నింట్లోనూ మైనస్సే.."
ఏపీలో గత ఎన్నికల్లో కూటమిగా జట్టు కట్టి జనసేన, బీజేపీతో పాటు ప్రయాణం చేస్తున్న టీడీపీ .. తమ మిత్రపక్షాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. జనసేన, బీజేపీ నేతలతో ప్రస్తుతానికి అవసరం ఉన్నా లేకపోయినా, వారిని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేస్తోంది. అయితే అభివృద్ధి విషయంలో మాత్రం వారు వెనుకబడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా వెనుకబడిన ఓ ఎమ్మెల్యేకు సీఎం చంద్రబాబు (Chandrababu) బహిరంగంగానే షాకిచ్చారు.
ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరులో పెన్షన్ల పంపిణీ కోసం వెళ్లిన సీఎం చంద్రబాబు.. ఎప్పటిలాగే నిర్వహించిన ప్రజా వేదిక సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ముందు స్ధానిక జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ (Bommidi Nayakar) పలు విజ్ఞప్తులు చేశారు. దీంతో ఎమ్మెల్యే వినతులపై చంద్రబాబు కాసింత ఘాటుగానే స్పందించారు. నరసాపురం ఎమ్మెల్యే పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నింటిలోనూ మైనస్‌లో ఉన్నారని జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే గా మీరు పనిచేయాలంటూ బొమ్మిడి నాయకర్ కు చంద్రబాబు బహిరంగంగానే సూచించారు. నరసాపురం వెనుకబడిందంటూ సీఎం వ్యాఖ్యానించారు. సమస్యలు నాకు చెప్పడం కాదు, అవసరమైతే ప్రజల సహకారంతో సమస్యలు పరిష్కరించాలంటూ ఆయనకు సూచించారు. నోడల్ అధికారిని మార్చి యాక్టివ్‌గా పనిచేసేవారిని నియమించాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేకు ఓ సలహా కూడా ఇచ్చారు. చంద్రబాబు ఆగ్రహంతో జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు ఏం మాట్లాడాలో తెలియక అలాగే ఉండిపోయారు. ఈ ఘటన కూటమి పార్టీల్లో చర్చనీయాంశమవుతోంది.














Click it and Unblock the Notifications