వద్దంటూ.. సాక్షిని చదువుతూ దొరికిపోయిన బాబు!: జగన్ నేరాలపై..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాక్షి పత్రిక చదువుతూ కనిపించారు. సాక్షి పత్రిక ఇష్టారీతిగా ప్రభుత్వంపై బురద జల్లుతూ కథనాలు రాస్తోందని, దానిని పక్కన పెట్టాలని చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించారు.
విశాఖ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాక్షి పత్రిక చదువుతూ కనిపించారు. సాక్షి పత్రిక ఇష్టారీతిగా ప్రభుత్వంపై బురద జల్లుతూ కథనాలు రాస్తోందని, దానిని పక్కన పెట్టాలని చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించారు. సాక్షిని చూడొద్దు, చదువవద్దని పలుమార్లు చెప్పారు.
అదే చంద్రబాబు మంగళవారం సాక్షిని చదువుతూ కనిపించారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన మంగళవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఓ సమయంలో కారులో వెళ్తూ సాక్షి పత్రిక చదివారు. దీనిపై సాక్షి ఓ కథనం కూడా రాసింది.

సాక్షి క్లిప్పింగ్స్‌తోనే..
చంద్రబాబు పైకి అలా చెబుతున్నప్పటికీ తన ఫీడ్ బ్యాక్ కోసం సాక్షి పత్రికలో వచ్చే కథనాల పైనే ఆధారపడతారని అనేకమంది పార్టీ నేతలు చెబుతుంటారని, ఇటీవలి కాలంలో పార్టీ నాయకులతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించిన సందర్భంలోను ఒక్కో నాయకుడి పనితీరును బేరీజు వేయడానికి చంద్రబాబు తనయుడు లోకేష్ సైతం సాక్షి క్లిప్పింగ్స్‌ను చూపించి నాయకులకు రేటింగ్ ఇచ్చారని పేర్కొంది.

తీరిక దొరికినప్పుడు..
సాక్షి పత్రికను చదువవద్దని చెప్పే చంద్రబాబు తీరిక దొరికినప్పుడల్లా ఆ పత్రికను తప్పనిసరిగా చదువుతారని టీడీపీ సీనియర్లు చెప్పే విషయం రూఢీ అయిందని పేర్కొంది.
పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు మంగళవారం ఉధయం విశాఖ వెళ్లారు. ఎయిర్ పోర్ట్ నుంచి బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు కాన్వాయ్‌లో వెళ్తున్న సమయంలో సాక్షి పత్రికను తీసుకొని చదివారు. దాంతో పాటు జిల్లా టాబ్లాయిడ్ కూడా చూశారు. చంద్రబాబుతో పాటు ఆ సమయంలో జిల్లా కలెక్టర్ ఉన్నారు.

జగన్ నేరాలపై ప్రజలు చర్చించాలి
కాగా, చంద్రబాబు వైసిపిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీపై ఆయన పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. దొంగల పార్టీ, రౌడీల పార్టీ, నేరస్థుల పార్టీ అని వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. ఆ పార్టీ నేతల పనే నేరాలు, మోసాలు చేస్తూ ఉండటమని వ్యాఖ్యానించారు.
ఆ పార్టీ వాళ్లు తప్పుడు లేఖలు రాస్తూ, తండ్రిని అడ్డం పెట్టుకుని ఎక్కడికక్కడ దోచుకున్నారని చంద్రబాబు విమర్శించారు. ఈ విషయాలపై ప్రజలు కూడా చర్చించాల్సిన అవసరముందన్నారు. వేలకోట్ల రూపాయిలు అవినీతి చేసి ఉండే ఆస్తులకు కూడా లెక్కలు చెప్పలేక అధికార పార్టీపై ఎదురుదాడి చేస్తోందన్నారు.

కాపులకు న్యాయం చేస్తా
కాపులకు న్యాయం చేస్తామని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చంద్రబాబు చెప్పారు. నుకబడిన వర్గాల వారు ఎప్పుడూ టీడీపీతో ఉన్నారన్నారు. టీడీపీ హయాంలో వెనుకబడిన వర్గాల వారికి ఎక్కడా అన్యాయం జరగకుండా చూస్తున్నామన్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వారికి తీవ్ర అన్యాయం చేసింది.. దాన్ని సరిదిద్దడానికి వడ్డీతో సహా వెనుకబడిన వర్గాల వారిని అభివృద్ధిబాటలో నడపడానికి ఈ ప్రభుత్వం ముందుకుపోతోందన్నారు.
వెనుకబడిన వర్గాలతోపాటు కాపులకు కూడా రిజర్వేషన్లు ఉంటాయని, వాటిని ఎక్కడా టచ్ చేసే పరిస్థితులుండవని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దానికంటే ఎక్కువగా న్యాయ ప్రకారం గతేడాది, ఈ ఏడాది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాపులకు రూ. వెయ్యికోట్లు కేటాయించిన ఘనత టీడీపీదే అన్నారు.

మీ కోసమే కష్టపడుతున్నాం
తాము కష్టపడేది ప్రజల కోసమేనని, వారి కన్నీళ్లు తుడవడానికేనని, ఇందుకు మీరు చేయాల్సింది నిండు మనసుతో మరోసారి ఆశీర్వదించడమేనని ప్రజలను చంద్రబాబు కోరారు. ఎప్పటికప్పుడు ఒక నమ్మకంతో ప్రజలు ముందుకు రావాల్సిన అవసరముందన్నారు. ఈ ప్రభుత్వం దీక్షతో పని చేస్తోందన్న ఓ చర్చ ప్రజల్లో జరగాలన్నారు.
సమర్థవంతంగా పని చేస్తూ, ప్రజలకోసం డబ్బులు కూడా సమర్థవంతంగా ఖర్చుపెడుతున్నామని చెప్పారు. మేం ఖర్చుపెట్టే ప్రతి పైసా పేదవాడి కన్నీళ్లు తుడవాలని, మీ ముఖంలో ఆనందం చూడటానికి, మీ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోవాలనేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకుగాను తాత్కాలిక, ధీర్ఘకాలిక ప్రయోజనాలు ఆలోచిస్తున్నామన్నారు.

కాంగ్రెస్‌పై కాంక్రీట్, సిమెంట్..
ఏపీని విడదీసిస మన పొట్ట కొట్టింది కాంగ్రెస్ పార్టీ అని చంద్రబాబు అన్నారు. దగా చేసిన అలాంటి పార్టీని భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో తలెత్తకుండా, పూర్తిగా భూస్థాపితం చేయాలన్నారు. భూస్థాపితం అంటే మామూలుగా కాదు.. మళ్లీ ఆ పార్టీ ఎక్కడా కనిపించకుండా సిమెంట్, కాంక్రిట్టు వేసి బయటికి రాకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.












Click it and Unblock the Notifications