సీబీఐకీ, బీజేపీకి చంద్రబాబు గుడ్ న్యూస్..!
ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధానిలో గతంలో పలు సంస్ధలకు కేటాయించిన భూకేటాయింపుల్ని సమీక్షిస్తున్న మంత్రివర్గ ఉవసంఘం ఇవాళ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో గతంలో చేసిన భూకేటాయింపుల్ని కొనసాగించడం, మార్పులు చేర్పులు చేయడంతో పాటు ఇతర నిర్ణయాలు కూడా ఉన్నాయి.
అమరావతిలో భూకేటాయింపుల కోసం ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ భేటీ అయింది. ఇందులో రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై చర్చించారు. మంత్రులు నారాయణ, భరత్ తో పాటు ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. అలాగే జూమ్ ద్వారా మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ కూడా హాజరయ్యారు. ఈ భేటీలో 16 అంశాలకు గాను 12 అంశాల్ని ఆమోదించారు.

2014- 19 కాలంలో రాజధానిలో భూములు కేటాయించిన సంస్థల్లో నాలుగు సంస్థలకి వాటిని కొనసాగించారు. ఇందులో సీబీఐకి రెండు ఎకరాలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు రెండు ఎకరాలు, రాష్ట్ర ఫోరెన్సెక్ సైన్స్ ల్యాబ్ కు ఎకరాలు, ఏపీ సహకార బ్యాంక్ లిమిటెడ్ కు ఐదు ఎకరాలను కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్ బత్తీకి భూ కేటాయింపులు రద్దు చేశారు. మరోవైపు కొత్తగా ఆరు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు.
ఐటీ శాఖకు రెండు ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్ కు రెండు ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు 0.4 ఎకరాలు, రాష్ట్ర నిఘా బ్యూరోకు అర ఎకరం, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కి మరో అర ఎకరం, బిజెపి పార్టీకి రెండు ఎకరాల చొప్పున కేటాయించారు. భూములు కేటాయించిన సంస్థలు టైమ్ లైన్ ప్రకారం నిర్మాణం చేయాలని డెడ్ లైన్ పెట్టారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 130 సంస్థలకు 1270 ఎకరాలు ఇచ్చిందని, ఈ సంస్థల్లో కొంతమంది మాత్రమే నిర్మాణాలు చేపట్టారని, గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన మిగిలినవారు ఎవరు నిర్మాణాలకు ముందుకు రాలేదని మంత్రి నారాయణ తెలిపారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక భూముల కోసం దరఖాస్తు చేసుకున్న 64 సంస్థలకు 884 భూ కేటాయింపులకు చేశామని తెలిపారు.
ఈరోజు పది సంస్థలకు భూ కేటాయింపులు చేశామన్నారు. గతంలో కేటాయించిన సంస్థలకు గడువు ముగిసిందని, మంత్రివర్గ ఉప సంఘంలో మరోసారి చర్చకు పెట్టి రివైజ్ చేసినట్లు తెలిపారు. భూములు కేటాయించిన సంస్థలకు నాలుగు నుంచి ఆరు నెలలు సమయం ఇచ్చామని, రాబోయే రెండు మూడు నెలల్లో అన్ని సంస్థలు నిర్మాణాలు చేపడతాయని వెల్లడించారు. కేటాయించిన సమయంలో నిర్మాణాలు చేపట్టకపోతే భూములు రద్దు చేస్తామన్నారు. అమరావతిలో పిలిచిన అన్ని టెండర్స్ కు పనులు మొదలయ్యాయని, ప్రస్తుతం 10,000 మంది పైగా కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications