జగన్ మూర్ఖపు పాలకుడు, అందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు: అమరావతి ఉద్యమం గుర్తు చేసిన చంద్రబాబు
పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం 500వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజధాని రైతుల శాంతియుత నిరసన నేపథ్యంలోనైనా సీఎం జగన్ తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా చంద్రబాబు మరోసారి జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు .

ఐదువేల రోజులైనా రాజధాని అమరావతి కోసం ఉద్యమం కొనసాగిస్తాం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పరిపాలన రాజధానిగా కొనసాగించాలని మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసన 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా రైతులు మరోమారు తమ డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని, అప్పటివరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.రాజధానిగా అమరావతినే కొనసాగించటం కోసం ఐదువేల రోజులైనా పోరాటం చేస్తామని అమరావతి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఐకాస నేతలు స్పష్టం చేశారు.

ఉద్దండరాయునిపాలెం దీక్షా శిబిరం బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఐకాస
ఉద్దండరాయునిపాలెం దీక్షా శిబిరం బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించి బుద్ధుడు చెప్పిన అహింస మార్గంలోనే అమరావతి లక్ష్యాన్ని సాధిస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాట పంథాను వీడేది లేదని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ఉద్యమం 500 రోజుకు చేరుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాజధాని రైతుల పోరాటానికి విజయం దక్కాలని ఆకాంక్షించారు.

జగన్ లాంటి మూర్ఖపు పాలకుడిని చూడడం చరిత్రలో ఇదే మొదటిసారి
ఇన్ని రోజులుగా రైతులు శాంతియుతంగా తమ నిరసనలు తెలియజేస్తున్న సీఎం జగన్ పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేసిన చంద్రబాబు ప్రజా రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 500 రోజులు. తన పాలనలో తాను తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి సుమారు 29 వేల మంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తూ ఉంటే, 500 రోజులలో ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడని మూర్ఖపు పాలకుడిని చూడడం చరిత్రలో ఇదే మొదటిసారి అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

రాజధాని మహిళలను బూటు కాళ్లతో తన్నినందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు
కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండనొల్లదు సుమతి అన్నారు.రాష్ట్ర రాజధాని కోసం తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్న మహిళలను బూటు కాళ్లతో తన్నినందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు అంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
పాలకులు ఎంత నిర్దయగా ప్రవర్తిస్తున్న ప్రజా రాజధాని అమరావతిని రక్షించడం కోసం 500 రోజులుగా శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్న రైతులు, రైతు కూలీలు, మహిళలకు అంతిమ విజయం దక్కాలని ఆశిస్తున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. రాజధాని అమరావతి రైతుల పోరాటానికి తన మద్దతును ప్రకటించి ఉద్యమం ఇంకా కొనసాగుతుంది అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications