Chandrababu: స్పీకర్ కు తన అభిప్రాయం చెప్పేసిన చంద్రబాబు..!
ఏపీలో రాజ్యసభ ఎన్నికల వేళ పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం తెరపైకి వచ్చింది. టీడీపీ నుంచి గత ఎన్నికల తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించినా వారిపై అనర్హత వేటు ఫిర్యాదు ఇవ్వకుండా కాలయాపన చేసిన చంద్రబాబు.. తాజాగా తమ పార్టీలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అనర్హత ఫిర్యాదు ఇవ్వగానే స్పందించారు. పార్టీ నేతల్ని పంపి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరామ కృష్ణమూర్తి, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధర్ కు నోటీసులు పంపారు. తమ అనర్హత వేటుపై సొంత పార్టీ టీడీపీ నుంచి అందిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని కోరారు. వారంలోగా సంతృప్తికర వివరణ ఇవ్వకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వారు వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో అనర్హత వేటు ఫిర్యాదుపై తన అభిప్రాయం కూడా చెప్పాలని పార్టీ అధినేత హోదాలో చంద్రబాబుకూ స్పీకర్ లేఖ రాశారు.

దీనిపై స్పందించిన చంద్రబాబు ఇవాళ స్పీకర్ కు జవాబు పంపారు. ఈ లేఖను పార్టీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి స్వయంగా వెళ్లి స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందజేశారు. ఇందులో చంద్రబాబు..పార్టీ నిర్ణయం మేరకే అనర్హత పిటిషన్ ఇచ్చామని స్పీకర్ కు తెలిపారు. అలాగే తాము కోరిన విధంగా సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సూచించారు.దీంతో స్పీకర్ తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అసలే అరకొరగా ఉన్న టీడీపీ బలాన్ని మరింత తగ్గించేందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు స్పీకర్ తమ్మినేనికి పంపిన సమాధానం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిని నిలబెట్టి వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోబోతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications