అధికారులతో చంద్రబాబు సమీక్ష: రాజధానికి కార్యాలయాల తరలింపునకు కమిటీ
అమరావతి: మంత్రులు, అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్‌వోడీల తరలింపు, రుణమాఫీ తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆగస్టులో కొన్ని కార్యాలయాలు ఏపీకి తరలించే యోజనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఏపీ రాజధాని ప్రాంతానికి కార్యాలయాల తరలింపునకు ఐదుగురు ఐఏఎస్‌లతో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటిలో సభ్యులుగా ఐఏఎస్ అధికారులు జవహర్‌రెడ్డి, లవ్ అగర్వాల్, శ్యాంబాబు, జయలక్ష్మీ, హేమ మునివెంకటప్పలను నియమించారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో 225 సర్వేయర్ల పోస్టుల భర్తీ చేయనున్నట్లు అధికారులతో తెలిపారు. ఇకపై ఆన్‌లైన్‌లోనే భూముల వివరాలను పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి ఏపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సమావేశం అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ ఇక మీద రైతులు పట్టాదారు పాసుపుస్తకం లేకపోయినా బ్యాంకులో రుణాలు పొందవచ్చని అన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు 13 వేల ట్యాబ్‌లు ఇస్తున్నామని తెలిపారు.
ట్యాబ్‌ల ద్వారానే రైతుల భూముల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామని చెప్పారు. భూ యజమానుల వివరాలతో పాటు పంట వివరాలను కూడా ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. భూవివాదాలపై ఫిర్యాదుల స్వీకరణకు ఆగస్టు 10 నుంచి 31 వరకు గ్రామసభలు నిర్వహించాలని చంద్రబాబు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పరకాల ప్రభాకర్ తెలిపారు.












Click it and Unblock the Notifications