టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ ... కోడెల మృతి, అక్రమ కేసులపై చర్చ.. కీలక నిర్ణయం
రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, అనుకోని విధంగా జరిగిన కోడెల ఆత్మహత్య, టిడిపి నాయకుల పై అక్రమ కేసులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని స్వీయ రక్షణలో పడేశాయి. వైసిపి ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు బనాయించినా, ధీటుగా ఎదుర్కొంటారని భావించిన చంద్రబాబు కు కోడెల మరణం ఒక షాకింగ్ న్యూస్ .ఇక దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో ఈరోజు ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ నాయకుల పై నమోదవుతున్న కేసుల గురించి
ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులపై ఏపీ అంతటా నమోదుచేసిన కేసులపై పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. అంతేకాదు కోడెల ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం, ఆయనపై నమోదైన కేసులు, పార్టీ నుండి అందాల్సిన సహకారం అందకపోవడం వంటి అనేక అంశాలు ఈ భేటీలో చర్చించారు. కోడెల మరణంతో చంద్రబాబు ఇక ఏ టిడిపి నేత అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండేలా పార్టీ నుండి వారికి సహాయ సహకారాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం .

ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిణామాలపై విచారణ చేపట్టాలని టిడిపి నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని కూడా గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరి కోడెల మృతిపట్ల తెలుగు తమ్ముళ్ల ఫిర్యాదుపై గవర్నర్ హరిచందన్ ఏ విధంగా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications