పథకాలు ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు- అర్ధం చేసుకోండి ప్లీజ్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకాలు అమలు చేస్తారని ఎదురుచూస్తున్న లబ్దిదారులకు సీఎం చంద్రబాబు ఇవాళ షాకిచ్చారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని వివరిస్తూ పథకాల అమలు ఎప్పుడనేది సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలు కూటమి సర్కార్ లో అమలు కావడం లేదని ఆవేదనతో ఉన్న లబ్దిదారులకు చంద్రబాబు భారీ షాకిచ్చినట్లయింది.
ఏపీ ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే దిగజారిందంటూ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేమని తేల్చేశారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించనని, ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇవన్నీ చెబుతున్నట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామన్నారు.

రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులపై నీతి ఆయోగ్ ఇచ్చిన ఆర్ధిక స్థిరత్వ నివేదికను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందన్నారు. అప్పుడు అభివృద్ధికి నిధులు కేటాయించలేని పరిస్ధితి ఎదురవుతుందన్నారు. అలాగని అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయన్నారు. అప్పులు చేస్తే తిరిగి చెల్లించే శక్తి ఉండాలని, కానీ రాష్ట్రానికి ఆ పరిస్దితి లేదన్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆఫీసులు తాకట్టు పెట్టిందన్నారు. అయినా ఆ డబ్పు ఏం చేశారో తెలియడం లేదన్నారు. గతంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టే పరిస్ధితీ లేదన్నారు.
వైసీపీ హయాంలో ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకురావడం, మూలధన కేటాయింపులు లేకపోవడం, పన్నుల పెంపు వంటి కారణాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అందుకే ఫిస్కల్ ఇండెక్స్ లో రాష్ట్రం 18వ స్ధానంలో ఉందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, తలసరి ఆదాయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకునే పరిస్ధితి కూడా లేదని చంద్రబాబు తేల్చిచెప్పేశారు. అయితే ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేసి తీరుతామన్నారు. ప్రజలు ఈ విషయాల్ని అర్దం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.












Click it and Unblock the Notifications