ఇదీ కారణం!: రాజీనామాలతో.. ఈ 5గురికే బాబు షాక్, లాబీయింగ్, రావెల తీవ్రఆగ్రహం, లిస్ట్ ఇదే!!
మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం విడతల వారీగా మంత్రులతో భేటీ అవుతున్నారు. అమరావతిలో మొత్తం కేబినెట్ విస్తరణ హడావుడి కనిపిస్తోంది.
అమరావతి: మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం విడతల వారీగా మంత్రులతో భేటీ అవుతున్నారు. అమరావతిలో మొత్తం కేబినెట్ విస్తరణ హడావుడి కనిపిస్తోంది.
ఆశావహులు, అసంతృప్తులు చంద్రబాబును కలుస్తున్నారు. కొందరు మరికొందరి కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఇక, చంద్రబాబు మూడు విడతలుగా మంత్రులతో భేటీ అవుతున్నారు. మార్పులు, చేర్పులపై చర్చిస్తున్నారు.
5గురు ఔట్, 11 మంది ఇన్
కేబినెట్ విస్తరణలో భాగంగా అయిదుగురు మంత్రులకు ఉద్వాసన పలుకుతున్నారు. వారిలో రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాథ్ రెడ్డి, బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, మృణాళిని, పీతల సుజాతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్లోకి కొత్తగా 11 మందిని తీసుకుంటారు.
కేబినెట్లోకి కొత్తగా తీసుకునే వారిలో కళా వెంకట్రావు (శ్రీకాకుళం), నారా లోకేష్ (చిత్తూరు), అమర్నాథ్ రెడ్డి (చిత్తూరు), పార్థసారథి (అనంతపురం), కాల్వ శ్రీనివాసులు (అనంతపురం), ఆదినారాయణ రెడ్డి (కడప), అఖిల ప్రియ (కర్నూలు), సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (ఎస్పీఎస్ నెల్లూరు), మాగుంట శ్రీనివాసులు రెడ్డి (ప్రకాశం), డేవిడ్ రాజు (ప్రకాశం), నక్కా ఆనంద్ బాబు (గుంటూరు), శ్రావణ్ కుమార్ (గుంటూరు), కాగితపు వెంకట్రావు (కృష్ణా), సుజయ కృష్ణ రంగారావు(విజయనగరం) ముందంజలో ఉన్నారు.
జహవర్ బాబు, చాంద్ భాషాలకు కేబినెట్లో చోటు కల్పించడంపై కూడా చర్చ జరిగింది. కేబినెట్లో తీసుకునే వారికి ఫోన్ చేసి రేపు (ఆదివారం) ప్రమాణ స్వీకారానికి రావాలని చెబుతున్నారు.

ఇదీ కారణం!
మంత్రివర్గ మార్పులు, చేర్పులలో ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నామనే అంశాన్ని చంద్రబాబు మంత్రులకు వివరించారు. తొలుత మంత్రులు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు వంటి వారితో భేటీ అయ్యారు. ఆ తర్వాత గంటా శ్రీనివాస రావు, శిద్ధా రాఘవ రావు, పీ నారాయణ, దేవినేని ఉమామహేశ్వర రావులతో భేటీ అవుతున్నారు.

మంత్రుల నుంచి రాజీనామాలు
మంత్రులతో భేటీ అనంతరం చంద్రబాబు ఉద్వాసన పలికే వారి నుంచి రాజీనామా లేఖలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, పీతల సుజాత, మృణాళిని, కొల్లు రవీంద్రలకు ఉద్వాసన పలికినట్లుగా తెలుస్తోంది. ఉద్వాసన లిస్ట్‌లో పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. వారి నుంచి రాజీనామాలు తీసుకొని, వాటిని ఆమోదించనున్నారని సమాచారం.

గవర్నర్‌కు కొత్త మంత్రుల జాబితా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ అర్ధరాత్రిలోగా కొత్త మంత్రులను ఖరారు చేసి గవర్నర్‌కు ఆమోదం కోసం పంపిస్తారు. కొత్త మంత్రివర్గంలో వైసిపి నుంచి నలుగురికి అవకాశం దక్కనుందని తేలుస్తోంది. భూమా అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, జలీల్ ఖాన్ తదితరులు రేసులో ఉన్నారు.

రావెల ఆగ్రహం
ముఖ్యమంత్రి చంద్రబాబును రావెల కిషోర్ బాబు కలిశారు. ఆయన అసంతృప్తితో వెళ్లినట్లు కనిపిస్తోంది. తద్వారా ఆయనకు ఉద్వాసన ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ఆ తర్వాత రావెల విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు సీఎం నిర్ణయం అని చెప్పారు. సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. రాజీనామా చేసినట్లుగా తెలుస్తోందని మీడియా ప్రశ్నించగా.. రావెల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేసినట్లు ఎవరు చెప్పారని మండిపడ్డారు.

లాబీయింగ్
బోండా ఉమా మహేశ్వర రావును కేబినెట్లోకి తీసుకోవాలని ఎంపీ కేశినేని నాని చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. పయ్యావుల కేశవ్ కోసం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నించారు. అలాగే, దూళిపాళ్ల నరేంద్ర కూడా చంద్రబాబును కలిసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. తాను అయిదుసార్లు ఎమ్మెల్యేను అని, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, తనకు అవకాశమివ్వాలని కోరారు. ఓ సమయంలో ఆయన కంటతడి కూడా పెట్టారని తెలుస్తోంది.

చిక్కులు
వైసిపి నుంచి గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరిన ఆదినారాయణ రెడ్డికి, టిడిపి నేత రామసుబ్బారెడ్డికి పొసగడం లేదు. ఇప్పుడు ఆదికి మంత్రి పదవి ఇచ్చే అవకాశంపై రామసుబ్బారెడ్డి మరింత అసంతృప్తితో ఉన్నారు. ఆదికి పదవి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిని కేబినెట్లోకి తీసుకుంటే, రామసుబ్బారెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. అయితే తనకు పదవి కంటే ఆదిని కేబినెట్లోకి తీసుకోవద్దనే ఉద్దేశ్యంతోనే రామసుబ్బారెడ్డి ఉన్నారు.

అమరావతికి చంద్రబాబు కుటుంబం, అఖిల ప్రియ
రేపు (ఆదివారం) కేబినెట్ విస్తరణ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబం, ఆశావహులు అమరావతి దారి పట్టారు. లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ సతీమణి బ్రాహ్మణి, బాలకృష్ణ తదితరులు వచ్చారు. అఖిల ప్రియ కూడా గుంటూరులోని విద్యానగర్‌లో గల తన ఇంటికి వస్తున్నారు.

హుటాహటిన చినరాజప్ప, ఏం చెప్పినా సరేనని అయ్యన్న
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అమలాపురం నుంచి హుటాహుటిన బయలుదేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు చాలా అవకాశాలు కల్పించారని, ఏం చెప్పినా చేస్తానని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్యమంత్రి ఇంటికి వచ్చారు.












Click it and Unblock the Notifications