చెత్త ప్రభుత్వం - ఉన్మాద పాలన..తాట తీస్తాం : నేనే ఎన్నికల సంఘానికి వెళ్తా - చంద్రబాబు ఫైర్..!!
ఏపీ ముఖ్యమంత్రి..మంత్రుల పైన టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణ పైన రాష్ట్ర ఎన్నికల సంఘం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. దీపావళి రోజు నామినేషన్లు ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైంది... ఎన్నికల సంఘం నిద్రపోతోందా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరిస్తే ఊరుకొనేది లేదన్నారు. ఎన్నికల సంఘం న్యాయంగా పని చేయకపోతే..తానే ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్తానని హెచ్చరించారు.

ఎన్నికల సంఘానికి వెళ్తాం
అవసరమైతే తమ పార్టీ వారికి అన్యాయం జరిగిన ప్రాంతాలకు వెళ్లి పోరాటం చేస్తానని స్పష్టం చేసారు. ఆర్వోలు డ్రామాలు ఆడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదని... వెంటాడతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నామినేషన్ పత్రాలు ఆన్‌లైన్‌లో దాఖలు చేసే వెసులుబాటు కల్పించటంతో పాటు స్కాన్ చేసిన ప్రతిని ఆర్వోకు ఈమెయిల్ చేసే వెసులుబాటు కల్పించాలని కోరామని తెలిపారు. కొంత మంది ఆర్వోలు నామినేషన్లను చెల్లకుండా చేసేందుకు కొన్ని డాక్యుమెంట్లను చించేసిన సంఘటనలు జరిగాయన్నారు.

దౌర్జన్యాలు సాగవు..తాట తీస్తాం
అభ్యర్ధులు నామినేషన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని దాఖలు చేయాలని సూచించారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వమని...తుగ్లక్ ముఖ్యమంత్రి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. డబ్బు - దౌర్జన్యంతో ఇష్టాను సారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీ దౌర్జన్యం పులివెందులలో జరుగుతుంది కానీ, ఇక్కడ జరగదని చంద్రబాబు హెచ్చరించారు. తాము చూస్తూ ఊరుకొనేది లేదని..తాట తీస్తామంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అనువుగా కొందరు అధికారుల్ని ముందుగా నియమించుకున్నారంటూ చంద్రబాబు ఫోటోలు ప్రదర్శించారు.

పెద్దిరెడ్డి అనుచరులను నియమిస్తారా
అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిని కుప్పంలో నియమించారని ఫోటోలు ప్రదర్శించడంతో పాటు... గురజాల సంఘటనలపై వీడియోలు ప్రదర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలని అన్నారు. ఫిర్యాదులు ఉన్న అధికారిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి చెప్పిందల్లా చేద్దామనుకుంటే తమ అంతం ప్రారంభమవుతుందని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు సహకరిస్తోందని... ఇష్టం వచ్చినట్లు చేద్దాం అనుకుంటే ఊరుకునేది లేదన్నారు.
Recommended Video

సరెండర్ అవ్వటానికి సిద్దంగా లేము
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలను అడ్డుకని తీరుతామని స్పష్టం చేశారు. ఎన్నికలు పకడ్బంధీగా జరిగితే వైసీప గెలవలేదన్నారు. డబ్బులు కూడా కొంతమేర పనిచేస్తాయని అనేక సంఘటనలు రుజువు చేశాయని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిర్వహించారని విమర్శించారు. ఉన్మాదులు తప్ప ఎవ్వరూ చేయని రీతిలో వ్యవహరించారన్నారు. ఈసారైనా ఎన్నికల ప్రక్రియ పకడ్బంధీగా జరగాలని ఇప్పటికే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడి..సరెండర్ అవ్వటానికి ఇక్కడ ఎవరూ సిద్దంగా లేరంటూ చంద్రబాబు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications