మిచౌంగ్ నష్టానికి సర్కార్ దే బాధ్యత-అప్రమత్తం చేయడంలో విఫలం-చంద్రబాబు ఫైర్
ఏపీలో మిచౌంగ్ తుపాను సందర్భంగా ప్రజల్ని అప్రమత్తం చేయడంలో వైసీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మిచౌంగ్ తుఫాన్ తో కనీవినీ ఎరుగని నష్టం జరిగిందని, ప్రభుత్వ వైఫల్యం వల్ల 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. ముందస్తుగా తుఫాన్ హెచ్చరికలు చేసినా ప్రభుత్వం శ్రద్ద తీసుకోలేదన్నారు. పట్టిసీమను వాడుకుంటే తుఫాన్ కంటే ముందుగానే పంట చేతికొచ్చేదన్నారు. కానీ ప్రభుత్వం పట్టిసీమ,పులిచింతల ను పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్ధను నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు. డ్రెయిన్ ల పూడికతీత తీయకపోవడం తో పొలాల్లో నీరు బయటకు వెళ్ళలేదన్నారు. సీఎం,మంత్రులు తుఫాను పై స్పందించడం లేదని, తుఫాన్ నష్టంపై రైతులకు భరోసా ఇవ్వడం లో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. కరువు,తుఫాన్ నష్టంపై కేంద్రాన్ని ఒక్క రూపాయి కూడా అడగలేదన్నారు. తన రాజకీయ చరిత్రలో చూడనంత నష్టం మిచౌంగ్ తుపాను సందర్భంగా జరిగిందన్నారు.

మిచౌంగ్ తుపాను బాధితులకు న్యాయం చేసేవరకూ టీడీపీ తరపున పోరాడతామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో కరువు,తుఫాన్ నష్టంపై శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు వైసీపీ సర్కార్ ను డిమాండ్ చేశారు. వచ్చేది రైతు ప్రభుత్వం... రైతులను ఆదుకుంటామన్నారు. అంగన్వాడీల న్యాయమైన పోరాటానికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications