Chandrababu: ప్రజాగళం నేటినుండే; కుప్పం నుండి సమర నినాదం; షెడ్యూల్ ఇలా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్నికల ప్రచారానికి ప్రధాన పార్టీల అధినేతలు శ్రీకారం చుట్టి ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. ఇప్పటికే వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను, బహిరంగ సభలను ప్రారంభిస్తుంటే, పోటాపోటీగా ప్రచార పర్వంలో దూసుకుపోవడానికి చంద్రబాబు సైతం బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల సమర నినాదం చేయనున్నారు.
రాయలసీమలో చంద్రబాబు తన ఎన్నికల ప్రచారాన్ని తన సొంత నియోజకవర్గమైన కుప్పం వేదికగా నేటి నుండి ప్రారంభించనున్నారు. ఓవైపు ఇడుపులపాయ నుంచి జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుంటే, మరోవైపు చంద్రబాబు కుప్పం నుండి, ప్రజా గళం పేరుతో బహిరంగ సభలు, రోడ్ షోలతో రచ్చ చేయనున్నారు.

నేడు చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనను మొదలుపెట్టి ఈనెల 31వ తేదీ వరకు ప్రచార పర్యటన షెడ్యూల్ ప్రకారం నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. ప్రతిరోజు రోజుకు రెండు నుండి మూడు నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటన సాగేలా టీడీపీ ఏర్పాట్లు చేసింది. నేడు చంద్రబాబు పర్యటన వివరాల్లోకి వెళితే..
ప్రజాగళంలో భాగంగా చంద్రబాబు కుప్పం నుండి బయలుదేరి పలమనేరులో ఉదయం 11 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆపై మధ్యాహ్నం 2. 30 నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరులో జరిగే ప్రజా గళం కార్యక్రమంలో పాల్గొంటారు.
సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఏడున్నర గంటల వరకు మదనపల్లిలో జరిగే ప్రజా గళంలో పాల్గొని, ఆపై రాత్రికి మదనపల్లిలోనే చంద్రబాబు బసచేస్తారు. మొత్తంగా రాయలసీమలో జగన్ వర్సెస్ చంద్రబాబు ప్రచార సభలు రాయలసీమలో పొలిటికల్ పొలిటికల్ హీట్ ను పెంచనున్నాయి. ప్రచార సభలతో ప్రజా క్షేత్రం లోకి వెళ్తున్న ఇద్దరు దిగ్గజ నేతలను ప్రజలు ఎలా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications