మారిన చంద్రబాబు వ్యూహం: వైయస్ జగన్ కార్నర్
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహం మార్చుకున్నట్లున్నారు. తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లుపై శాసనసభలో చర్చ విషయంలో కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుల వైఖరినే దాదాపుగా తెలుగుదేశం పార్టీ స్వీకరించినట్లు కనిపిస్తోంది. బిల్లును వెనక్కి తిప్పిపంపాలని కోరుతూ అతివాద సమైక్యవాదిగా కనిపిస్తూ వచ్చిన పయ్యావుల కేశవ్ వంటి సీమాంధ్ర శాసనసభ్యుడు వెనక్కి తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి.
పయ్యావుల కేశవ్ కూడా తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు పూనుకున్నారు. ఇంత కాలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులతో పాటు సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ వచ్చారు. కానీ గురువారంనాడు కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులతో పాటు తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు చర్చకు సహకరించారు. వైయస్ జగన్‌ను ఒంటరి చేసి, కార్నర్ చేసేందుకు చర్చకు సహకరించాలని చంద్రబాబు నాయుడు తమ పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులకు సూచించినట్లు చెబుతున్నారు.

చర్చ జరగకుండా చేసి, గడువు పెంచేందుకు అడిగే అవకాశం లేకుండా చేసి త్వరగా రాష్ట్ర విభజన జరిగేలా చూడాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో జగన్ వ్యూహాన్ని దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో చర్చకు అవకాశం కలిగేలా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే గురువారంనాడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను శాసనసభ నుంచి సస్పెండ్ చేసి, చర్చ సాగించారని అంటున్నారు.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి వైయస్ రాజశేఖర రెడ్డిని, వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్సిస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులు విమర్శిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కారణంగానే రాష్ట్ర విభజన జరుగుతోందనే వాదనను తెలుగుదేశం, కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులు ముందుకు తెస్తున్నారు. దీంతో సీమాంధ్రలో జగన్ బలపడకుండా చూడాలనే వ్యూహంతో వారు వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులు చర్చకు సహకరించడంతో వైయస్సార్ కాంగ్రెసు ఒంటరి అయిపోయింది.
సవరణలకు టిడిపి కసరత్తు
తెలంగాణ ముసాయిదా బిల్లులోని వంద క్లాజులకు కూడా సవరణలు ప్రతిపాదించాలని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి వారు కసరత్తు చేస్తున్నారు. విడివిడిగా ఈ సవరణలు ప్రతిపాదించాలని, ప్రతి సవరణపై చర్చకూ ఓటింగ్‌కూ పట్టుబట్టాలని అనుకుంటున్నారు. ఆ రకంగా మొత్తం 4,400 సవరణలను ప్రతిపాదించాలని వారు నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
మారని వైయస్సార్ కాంగ్రెసు వ్యూహం
గురువారం శాసనసభ నుంచి సస్పెండ్ అయినప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు వ్యూహంలో మార్పు రాలేదు. రేపు శుక్రవారం శాసనసభలో సమైక్య తీర్మానానికి పట్టుబట్టాలని వారు నిర్ణయించుకున్నారు. సమైక్య తీర్మానం చేసిన తర్వాత తాము ముసాయిదా బిల్లుపై చర్చకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఆ రకంగా తమకు కూడా చర్చలో పాల్గొనే అవకాశం కల్పించాలని వారు స్పీకర్‌ను కోరనున్నారు. సవరణలపై కాకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు స్పీకర్‌ను కోరనున్నారు.
సీమాంధ్ర సభ్యులతో కిరణ్ రెడ్డి
కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర శానససభ్యులతో గురువారం సాయంత్రం చర్చలు జరిపారు. శాసనసభలో చర్చ సందర్భంగా సభా వ్యవహారాల శాఖ మంత్రిగా శైలజానాథ్ వ్యవహరిస్తున్నారు. తాము అనుకున్న రీతిలో చర్చను కొనసాగించడానికి శైలజానాథ్‌కు ఆ శాఖను ఇవ్వడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి వెసులుబాటును కల్పించుకున్నారని అంటున్నారు.
ముఖ్యమంత్రితో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌తో పాటు మంత్రులు వట్టి వసంతకుమార్, శైలజానాథ్, మహీధర్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. బిల్లులో ప్రతిపాదించాల్సిన సవరణలపై వారు చర్చించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications