ఏపీలో చంద్రబాబు మరో కలెక్టర్ల సదస్సు..! తేదీలు, అజెండా ఇదే..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు కావస్తోంది. మరో ఏడాదిన్నర ఆగితే ఎన్నికల వాతావరణ మొదలవుతుంది. ఈ లోపు రాష్ట్రంలో పూర్తి చేయాల్సిన పనులు, ఇప్పటికే మొదలుపెట్టిన పనుల పురోగతి, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు మరోసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సదస్సుకు సంబంధించిన తేదీలు, అజెండా, ఇతర అంశాల్ని ఇప్పటికే ఫిక్స్ చేశారు.
ఈ నెల 10, 11 తేదీల్లో అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) కలెక్టర్ల సదస్సు నిర్వహించబోతున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో.. ముందుగా గతంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలు, నిర్ణయాలు, వాటి పురోగతిపై చర్చిస్తారు. అనంతరం స్వర్ణాంధ్ర 2047 మిషన్ పురోగతికి సంబంధించి అధికారుల నుంచి చంద్రబాబు రిపోర్టులు తీసుకోబోతున్నారు. ఇందులో రాష్ట్ర ఆర్ధిక వృద్ధితో పాటు జిల్లాల వారీగా లక్ష్యాలు కూడా ఉంటాయి.

వీటి తర్వాత రాష్ట్రంలో కూటమి మ్యానిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాల అమలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, జలధార వంటి కార్యక్రమాల పురోగతిపై చర్చించడంతో పాటు కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే ఉత్తమ కలెక్టర్ల ఆవిష్కరణలపై ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఉంటాయని తెలుస్తోంది. రెండో రోజు సదస్సులో ఈ-గవర్నెన్స్ తో పాటు ఆర్టీజీఎస్, పీజీఆర్ఎస్ వంటి కార్యక్రమాలపై సీఎం సమీక్షిస్తారు. అలాగే కలెక్టర్లతో ఓపెన్ ఫోరంలో మాట్లాడటంతో పాటు శాంతిభద్రతల్ని కూడా ముఖ్యమంత్రి సమీక్షించబోతున్నారు.














Click it and Unblock the Notifications