అందుకే మనం దెబ్బతిన్నాం: కేంద్రంపై బాబు అసహనం, కేంద్రం మరోసారి మోసం: కేశినేని
అమరావతి: కేంద్రంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాల్సింది పోయి, అడ్డుకోవడం సరికాదన్నారు. పన్నులు చెల్లిస్తున్నా మనకు ఇవ్వాల్సింది ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో నీతి అయోగ్ సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, విభజన సమస్యలపై సచివాలయంలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం సహకారం లేకున్నా 10.5 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. అనేక కష్టాలు, అడ్డంకులు, ఆటంకాలు ఎదురువుతున్నా మూడేళ్ల నుంచి కష్టపడి పని చేసి రెండంకెల వృద్ధి రేటు సాధించామన్నారు.

డబ్బులు లేకున్నా ఖర్చు చేస్తున్నాం
పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు లేకున్నా ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. డయాఫ్రం వాల్ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. పోలవరం విషయంలో మన వాదనలు గట్టిగా వినిపించాల్సి ఉందన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత నిధుల విడుదలలో ఆలస్యం సరికాదన్నారు. పోలవరం మన జీవనాడి, సెంటిమెంట్ అని చెప్పారు. లెక్కలు చెప్పలేదని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. హోదా కోసం కేంద్రాన్ని నిలదీయాలన్నారు.

అందుకే మనం 2014లో దెబ్బతిన్నాం
బుధవారం రాత్రి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో అమరావతిలో చంద్రబాబు సమావేశమయ్యారు. ఓడిపోతామనే భయంతోనే ఉప ఎన్నికలు రాకుండా వైసీపీ రాజీనామా డ్రామా ఆడిందన్నారు. ఉప ఎన్నికలు వస్తే అయిదు పార్లమెంటు స్థానాల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయేదన్నారు. బీజేపీ, ఆ పార్టీతో కుమ్మక్కైన వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. కుట్ర రాజకీయాలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. తిరుపతి పార్లమెంటు సీటును చివరి నిమిషంలోబీజేపీకి ఇవ్వడం వల్ల 2014లో దెబ్బతిన్నామని, నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలిచినా ఎంపీ స్థానం కోల్పోవడానికి జాప్యమే కారణం అన్నారు. కలిసి పని చేస్తే వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు మనవే అన్నారు.

కేంద్రం మరోసారి మోసం చేసింది: నాని
ప్రత్యేక హోదా తర్వాత ఇప్పుడు కడప ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం మరోసారి మోసం చేసిందని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. మెకాన్ సర్వేలో ఉక్కు ఫ్యాక్టరీపై సానుకూలత వ్యక్తమైనా అఫిడవిట్ ద్వారా కేంద్రం దుర్బుద్ధిని చూపిందన్నారు. మోడీ, అమిత్ షాలకు ఏపీ పట్ల ప్రేమ ఉందని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావులు చెబుతున్నారని, కానీ వారివి పచ్చి అబద్దాలు అని తేలిందన్నారు.

జగన్‌పై కేశినేని నాని ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తమ పార్టీని విమర్శించే నైతిక అర్హత లేదని కేశినేని నాని అన్నారు. పన్నెండు కేసుల్లో అతను ఏ1 నిందితుడు అని, వాటి మాఫీ కోసమే పార్టీ నడుపుతున్నారని ఆరోపించారు. సొంత జిల్లాకు న్యాయం చేయలేని పరిస్థితిలో జగన్ ఉన్నారన్నారు. బీజేపీ నేతలవి నోరు తెరిస్తే అబద్దాలు అన్నారు.












Click it and Unblock the Notifications