కాల్‌మనీ అంశం డైవర్షన్ కోసం అంబేద్కర్ విగ్రహాన్ని వాడుకున్న వ్యక్తి చంద్రబాబు: మంత్రి రోజా!!
ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. అంబేద్కర్ విగ్రహావిష్కరణ తో సీఎం జగన్మోహన్ రెడ్డిని అందరూ అభినందిస్తున్నారని, కానీ చంద్రబాబు అనుకూల మీడియా తట్టుకోలేకపోతుందని, కనీసం అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కొన్ని మీడియా సంస్థలు చూపించలేదని ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు.
అంబేద్కర్ కు నిజమైన వారసుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్న రోజా, ఇక ఇదే విషయాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ను పచ్చ మీడియా అవమానించడం అంటే, అంబేద్కర్ కు అండగా నిలబడిన వర్గాలను కూడా అవమానించడమేనని మంత్రి రోజా పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని అందరూ అభినందిస్తూ ఉంటే చూసి తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు.

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 100 అడుగుల విగ్రహం పెడతానని చెప్పి కనీసం ఒక విగ్రహమైనా పెట్టారా అంటూ రోజా ప్రశ్నించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం అంబేద్కర్ విగ్రహాన్ని వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి రోజా మండిపడ్డారు. అంబేద్కర్ ను తన ప్రచారం కోసం, సమస్యల డైవర్షన్ కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి రోజా విమర్శించారు.
చంద్రబాబు తాను తోపు, తురుము అని చెప్పుకుంటారని, కానీ విజయవాడ నడిబొడ్డులో ఏ ఒక్కరోజైనా ఇటువంటి కార్యక్రమం చేయగలిగారా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. అంబేద్కర్ పట్ల చంద్రబాబు వైఖరి ప్రజలకు తెలుసని మంత్రి రోజా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపి జనసేన తోక పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని, అంబేద్కర్ స్మృతి వనాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవని దీనిని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి రోజా తెలిపారు. విజయవాడను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి రోజా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications