సిఎం రమేష్ వర్సెస్ ఎర్రబెల్లి: చంద్రబాబు హెచ్చరిక
హైదరాబాద్: తమ పార్టీ నాయకులు సిఎం రమేష్, ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య నెలకొన్న వివాదంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. వారిద్దరు పరస్పరం తీవ్రమైన పదజాలంతో బహిరంగంగా దూషించుకున్న విషయం తెలిసిందే. వారిద్దరిపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. శనివారం ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.
నాయకులు బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని, ఏదైనా ఉంటే పార్టీ వేదికపై మాట్లాడుకోవాలని ఆయన సూచించారు. పరస్పరం బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువు తీయవద్దని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు సిఎం రమేష్, పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాద రావులతో తెలంగాణ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకు నెలకొన్న విభేదాలపై సమావేశంలో చర్చించారు.

ఎవరు కూడా పార్టీ వ్యతిరేర విధానాలకు పాల్పడవద్దని చంద్రబాబు హెచ్చరించారు. పార్టీ అంతర్గతంగా చర్చించుకునే విషయాలపై బహిరంగంగా మీడియాకు ఎక్కవద్దని ఆదేశించారు. తెలంగాణ అంశంపై ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ ముగ్గురు నాయకులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై వారు ప్రతి విమర్శలు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో కలకలం ప్రారంభమైంది.
అదే విధంగా తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర రెండో దశపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు తొలి విడత తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. మలి విడత యాత్రను ఈ నెల 21వ తేదీనుంచి తలపెట్టారు. అయితే, దాన్ని చంద్రబాబు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications