TDP రెబెల్స్ కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్- తప్పుకుంటే ఆఫర్..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార కూటమికి ప్రతిష్టాత్మకంగా మారాయి. గత ఎన్నికల్లో ఘన విజయం తర్వాత, రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి సర్కార్.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ గెలిసి ప్రజల్లో తమకు పట్టు సడలిపోలేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో విపక్ష వైసీపీ విసురుతున్న సవాల్ తట్టుకుంటూ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు రెబెల్స్ రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెబెల్స్ కు పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో తప్పుకుంటే పదవులు ఇస్తామన్న ఆఫర్ కూడా ఇచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ రెబెల్స్ బెడద ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబు (Chandrababu) ఇవాళ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో వారిని పార్టీ రెబల్స్ వేసిన నామినేషన్లను ఉపసంహరించుకునేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్ధుల విజయానికి కృషి చేయాలని సూచించారు. అలాగే పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో పాటు కూటమి పార్టీలు సమన్వయంతో వ్యవహరించాలని నేతలకు సీఎం సూచించారు.

తాను ముఖ్యమంత్రిగానే కాకుండా ఎన్నికలయ్యే వరకూ ఒక పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తానని చంద్రబాబు తెలిపారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పార్టీ కార్యకర్తలగానే పని చేయాలన్నారు. 11 కార్పొరేషన్లు 11 సామాజికవర్గాలకు కేటాయించామని, అన్ని కులాలను రాజ్యాధికారంలో భాగం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వేలమందికి ఈ ఎన్నికలతో ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. కాబట్టి ప్రజలు ఆమోదించిన వారిని , ప్రజల్లో గుర్తింపు ఉన్నవారిని ఎంపిక చేయాలని సూచించారు. మంచి నేతలు లేకపోతే గ్రామాల్లో కూడా పార్టీ బలహీన పడుతుందన్నారు. సమర్ధులను నియమించుకుంటే పార్టీ పటిష్టంగా ఉంటుందన్నారు. పార్టీ కోసం పని చేసిన వేలాది మందికి స్థానిక ఎన్నికల్లో సీట్లు ఇవ్వవచ్చని, కానీ సమీకరణాలు, పొత్తుల్లో భాగంగా ఎవరికైనా సీట్లు ఇవ్వలేకపోతే... అలాంటి వారికి నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.













Click it and Unblock the Notifications
