కడప జెడ్పీ ఛైర్మన్ పదవికి టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు ఫిక్స్ - హోరా హోరీ..!!
ఏపీలో స్థానిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తి అయింది. ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. ఇక.. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసారు. దీంతో.. కూటమి- వైసీపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్ధుల పైన తుది కసరత్తు కొన సాగుతోంది. రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్ధులను ఫిక్స్ చేస్తున్నారు. కాగా.. కడప సీటులో రెండు పార్టీల అభ్యర్ధులు దాదాపు ఖరారయ్యారు. ఇక్కడ ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది.
మున్సిపల్ ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ పలు మున్సిపాల్టీలు ఏకగ్రీవం చేసుకుంది. తమకు నామినేషన్ వేసే అవకాశం ఇవ్వలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా.. ఈ రోజు జెడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు.. అభ్యర్ధుల ఖరారు పైన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాగా.. మున్సిపల్ ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇప్పుడు జెడ్పీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. కడప జెడ్పీ ఛైర్మన్ పదవి జనరల్ కు కేటాయించారు. ఈ సీటు నుంచి వైసీపీ అభ్యర్దిగా దుష్యంత్ రెడ్డి ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లా పార్టీలో.. పులివెందులలో దుష్యంత్ రెడ్డి కీలక వ్యవహరిస్తున్నారు లింగాల జెడ్పీటీసీగా బరిలోకి దిగుతారని తెలుస్తోంది.

రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకం
కాగా.. మొత్తం 39 జడ్పీటీసీ స్థానాల్లో మెజారిటీ సాధించి జెడ్పీ ఛైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలని అధికార కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగా టీడీపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవగుడి భూపేష్ రెడ్డికి జెడ్పీ ఛైర్మన్ సీటు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి పుత్తా నరసింహారెడ్డి, ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి సోదరుడు సైతం రేసులో ఉన్నారు. వైసీపీకి పట్టు ఉన్న జిల్లా కావటంతో టీడీపీ ఇక్కడ అభ్యర్ధి విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటోంది. జిల్లాలో కీలకంగా వ్యవహరించిన దేవగుడి కుటుంబానికే జెడ్పీ పీఠం దక్కుతుందని చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే రెండు పార్టీల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
