జెసిపై సునీతకు బాబు బుజ్జగింపు, టిడిపిలోకి వలసలు
హైదరాబాద్: అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డిల చేరికపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జిల్లా పార్టీ నేతలకు నచ్చజెబుతున్నారు. మంగళవారం బాబు అనంత నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో జెసి సోదరుల చేరిక అంశాన్ని చర్చించారు. జెసి సోదరుల చేరికను ముఖ్యంగా పరిటాల సునీత వ్యతిరేకిస్తున్నారు. వారిని బాబు బుజ్జగిస్తున్నట్లు సమాచారం.
టిడిపిలోకి భారీగానే వలసలు
విభజన నేపథ్యంలో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు కనిపిస్తున్నాయి. మంత్రులు టిజి వెంకటేష్, గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు ఈ నెల 27వ టిడిపిలో చేరే అవకాశాలున్నాయి. వారితో పాటు మరో ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. వారికి టిక్కెట్ పైన బాబుతో హామీ ఇప్పించుకునే పనిలో వీరు పడినట్లుగా సమాచారం.

అవంతి శ్రీనివాస్ (భీమిలి), వెంకట్రామయ్య (గాజువాక), రమణమూర్తి రాజు (యలమంచిలి), లబ్బి వెంకటస్వామి (నందికొట్కూరు), శిల్పా మోహన్ రెడ్డి (నంద్యాల) తదితరులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.
మరోవైపు తెలుగుదేశం పార్టీలో చేరికల నేపథ్యంలో చంద్రబాబు జిల్లా పార్టీ నేతలతో జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. ఆయా జిల్లాల పార్టీ నాయకుల అభిప్రాయాన్ని ఆయన తీసుకుంటున్నారు. వారిని అడగకుండా పార్టీలోకి తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని ఆయన నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications