ఎన్టీఆర్ లేకపోవడంపై హరికృష్ణ అలక, నూజీవీడు ఓకే
హైదరాబాద్/విజయవాడ: పార్టీ అధినాయకత్వంపై అలిగిన మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణకు కృష్ణా జిల్లా నూజివీడు టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన హరి మరోసారి అసంతృప్తి వెళ్లగక్కిన విషయం తెలిసిందే. హరికృష్ణ సన్నిహితులతో చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.
హరికృష్ణ సోదరుడు, హీరో బాలకృష్ణకు హిందూపురం సీటును టిడిపి టిక్కెట్ కేటాయించిన విషయం విదితమే. బాలకృష్ణ పెద్ద ప్రదర్శనతో వెళ్లి హిందూపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా... హరికృష్ణ మాత్రం తనకు కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబును గతంలోనే కోరానని చెప్పారు. కాని తనకు టిక్కెట్ కేటాయించకపోవడం పట్ల ఆయన నిరాశ వ్యక్తం చేశారు.

సమాచారం మేరకు... హరికృష్ణను అలక తీర్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ ఉద్దేశ్యంతో కృష్ణా జిల్లా నూజివీడు లేదా విజయవాడ తూర్పు సీటును కేటాయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నూజివీడు టిక్కెట్ కేటాయించినా హరికృష్ణ పోటీకి సిద్ధమంటున్నారు.
కాగా చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా తాను పెనమలూరు టిక్కెట్ ఇవ్వాలని ఆయనను గట్టిగా కోరానని, కాని తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే ప్రచారం చేశారని, ఈ ప్రచారం ఎవరు చేశారో తెలియదని, ఇదంతా పచ్చి అబద్ధమని, అలాగే తనకు హిందూపురం లోకసభ టిక్కెట్ ఇవ్వాలని పొలిట్‌బ్యూరో సమావేశంలో కోరానని హరి చెప్పిన విషయం తెలిసిందే.
హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారశైలిని చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబం వ్యతిరేకిస్తున్నాయి. హరికృష్ణ రాజ్యసభ ఎంపి పదవికి రాజీనామా చేసిన తీరును చంద్రబాబు పాదయాత్రలో తప్పుబట్టారు. పార్టీ వ్యవహారాల గురించి కుటుంబ సభ్యుడై ఉండి బహిరంగంగా మాట్లాడడాన్ని చంద్రబాబు ఆమోదించడం లేదు. జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా ప్రచారానికి ఉపయోగించుకోవడానికి టిడిపి ఆసక్తిని కనపర్చడం లేదు. ఇది కూడా హరికృష్ణకు కోపం తెప్పించింది.












Click it and Unblock the Notifications