బిజెపితో పొత్తుపై వ్యాఖ్య: రావెలపై చంద్రబాబు ఆగ్రహం
హైదరాబాద్: బిజెపితో పొత్తు అంశంపై వ్యాఖ్యలు చేసిన సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్ బాబుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం రావెలను పిలిచి, వ్యాఖ్యలపై వివరణ కోరినట్లు సమాచారం. తనతో సంప్రదించకుండా అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబు హెచ్చరించినట్లు సమాచారం.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు బిజెపితో పొత్తు కొనసాగుతుందని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. బిజెపితో పొత్తు అంశంపై తాము పునరాలోచన చేసుకుంటామని మంత్రి రావెల కిశోర్ బాబు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు.

కాగా, బిజెపితో పొత్తుపై తెలుగుదేశం పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని మంత్రి రావెల అన్నారు. ప్రత్తిపాడులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో ఎంత వరకు మిత్రపక్షంగా కొనసాగాలన్నది ఆలోచించాల్సి ఉందన్నారు. ఇటీవల బీజేపీలోకి పలువురు వలస పోవడంపై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు.
రాష్ట్రాభివృద్ధి, ప్రాజెక్టులు, కేంద్రం సాయం కోసమే బీజేపీతో జత కట్టామన్నారు. పార్టీ సిద్ధాంతాలపై రాజీపడేది లేదన్నారు. కాగా, రాజధాని కోసం భూ సేకరణపై జమ్ముల శ్యాం కిషోర్‌లాంటి బీజేపీ చోటా నేతలకు సమాధానం చెప్పనని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, హరిబాబు లాంటి స్థాయిగల వారు మాట్లాడితేనే స్పందిస్తానని మరో ప్రశ్నకు జవాబిచ్చారు.












Click it and Unblock the Notifications