జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
జమిలి ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలకు దేశమంతా సంపూర్ణ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో సుస్థిర పాలన ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. చంద్రబాబు బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పారు. అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధిపై దృష్టి సారించవచ్చన్నారు. యువత మనదేశానికి గొప్ప బలమని చంద్రబాబు చెప్పారు.

సుపరిపాలన వల్ల వచ్చే లాభాలను ప్రజలు చూశారు గనకే హర్యానాలో మూడోసారి బీజేపీకి అధికారం కట్టబెట్టారన్నారు. బీజేపీ అగ్రనాయకత్వం పనిచేసే విధానం వల్ల హర్యానాలో గెలిచారని చెప్పారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం ఎన్డీఏకు శుభసూచకమని చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై నమ్మకం ఉంచిన ప్రజలు.. సుస్థిరత, అభివృద్ధికే ఓటేశారన్నారు.
మరోవైపు, జమ్మూకాశ్మీర్‌లోనూ బీజేపీ బలమైన పార్టీగా ఎదిగిందన్నారు చంద్రబాబు. బీజేపీకి ఓట్ల శాతం బాగా పెరిగిందని చెప్పారు. మంచి పనులు చేసే ప్రభుత్వాలను ప్రజలు ఆదరిస్తారని అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఎన్డీఏకు మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఇది ఇలావుండి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిపెద్ద అరిష్టం వైసీపీ అధినేత వైఎస్ జగన్ అని దుయ్యబట్టారు చంద్రబాబు. రాష్ట్రం ఎలా ధ్వంసమైందో గత ఐదేళ్లలో చూశామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications