బాబు పాపులారిటీ చూశారా ? వాదిస్తున్నందుకు నాతోనూ ఫొటోలు-లూథ్రా ట్వీట్..!
ఏపీలో స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టు తర్వాత సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా ఇప్పుడు అందరికీ పరిచయం అయిపోయారు. చంద్రబాబు అరెస్టు తర్వాత సీఐడీ రిమాండ్ కోరినప్పుడు వాదించిన లూథ్రా.. ఆ తర్వాత బెయిల్ పిటిషన్లతో పాటు క్వాష్ పిటిషన్లనూ ఆయన తరఫున వాదనలు వినిపిస్తున్నారు. దేశంలో అత్యంత ఖరీదైన లాయర్ గా పేరుతెచ్చుకున్న లూథ్రా.. చంద్రబాబు తరఫున వాదించడం మొదలుపెట్టాక సోషల్ మీడియాలో పెడుతున్న ట్వీట్లు కూడా అంతే ప్రచారం పొందుతున్నాయి.
చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనకు రిమాండ్ విధించడం, ఆ తర్వాత పరిణామాలపై గతంలో లూథ్రా పలు ట్వీట్లు చేశారు. వీటిలో ఆయన వేదాంతం వల్లించారు. న్యాయం జరగనప్పుడు కత్తి పట్టాలంటూ ఓసారి, చీకట్లు కమ్ముకున్నాయంటూ మరోసారి, వివేకానందుడి సూక్తులతో ఇంకోసారి లూథ్రా చేసిన ట్వీట్లపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరిగింది. ఓ దశలో లూథ్రాపై కేసులు పెట్టేందుకు కూడా వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇప్పుడు చంద్రబాబు కేసు వాదనతో లూథ్రా పేరు జాతీయ స్ధాయిలో మరోసారి వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు పాపులారిటీ ఏ విధంగా ఉందో గుర్తు చేస్తూ ఇప్పుడు తనతో పాటు కూడా ఫొటోలు దిగేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారంటూ ఎక్స్ లో సిద్ధార్ధ్ లూత్రా ఓ ట్వీట్ చేశారు. ఇందులో తాజాగా ఢిల్లీలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఏపీకి చెందిన భద్రతా సిబ్బంది తనతో తీసుకున్న ఫొటోల్ని ఆయన షేర్ చేశారు. దీన్ని బట్టి చంద్రబాబుపై ఏపీ జనం ఎంత అభిమానం చూపుతున్నారో తెలుస్తోందంటూ ఓ ట్వీట్ కూడా చేశారు.
I find myself blessed to be the recipient of affection that denizens of AP have for CBN wherever I go! https://t.co/G1lYFwMjbI
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 28, 2023
ఆ విధంగా చంద్రబాబు కేసు వాదిస్తున్నందుకు ఆయనతో పాటు తనపైనా జనం అభిమానం చూపుతున్నట్లు సిద్ధార్ధ్ లూథ్రా వెల్లడించారు. దీంతో లూత్రా తాజా ట్వీట్ పైనా చర్చ జరుగుతోంది. గతంలో ఎంతోమంది లాయర్లు ప్రముఖుల తరపున వాదించినా ఎప్పుడూ ఇలా సోషల్ మీడియాలో చెప్పుకోలేదని, లూథ్రా మాత్రం ఎందుకిలా వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది.












Click it and Unblock the Notifications