Chandragiri Constituency: చంద్రబాబుకు గెలుపోటములు చూపించిన సీటు-చెవిరెడ్డి అడ్డాగా..
చిత్తూరు జిల్లాలోని కీలకమైన సీట్లలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఒకటి. ఒకప్పుడు చంద్రబాబుకు తొలిసారి గెలుపు రుచి చూపించి, ఆ తర్వాత ఓటమి రుచి కూడా చూపించిన అరుదైన సీటు ఇది. అంతే కాదు చంద్రబాబు కెరీర్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ పార్టీ మార్పుకు కారణమైన నియోజకవర్గం కూడా ఇదే. చంద్రగిరిలో గతంలో కమ్మ సామాజిక వర్గ ప్రభావం తీవ్రంగా ఉన్నా ఆ తర్వాత రెడ్లకు జై కొట్టడంతో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరుసగా గెలుస్తున్నారు.
1978లో తొలిసారి చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబు పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చంద్రబాబు 1983లో టీడీపీ హవాలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరి కుప్పం ఎమ్మెల్యేగా గెలవడం మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు చంద్రగిరిని వీడాక కూడా అక్కడ కమ్మ సామాజిక వర్గ ప్రభావం బలంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గ నేత గల్లా అరుణ కుమారిని ఏకంగా నాలుగుసార్లు (1989, 1999, 2004, 2009) గెలిపించిన సీటు ఇది. ఇక్కడ వరుస విజయాలతో గల్లా మంత్రిగా కూడా పనిచేశారు.

చంద్రగిరిలో 1978 నుంచి ఇప్పటివరకూ 10 సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 5 సార్లు, టీడీపీ మూడుసార్లు, వైసీపీ రెండుసార్లు గెలిచాయి. టీడీపీ తరఫున మేడసాని వెంకట్రామనాయుడు (1983), ఎన్ ఆర్ జయదేవ నాయుడు (1985), చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు (1994)లో ఇక్కడి నుంచి గెలిచారు. అయితే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండే చంద్రగిరి సీటు ఆ తర్వాత ఆ ఓటు బ్యాంకు అంతా వైసీపీకి మళ్లడంతో ఆ పార్టీ కంచుకోటగా మారిపోయింది.
గత రెండు ఎన్నికల్లో (2014, 2019)లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా చంద్రగిరి నుంచి గెలిచారు. ఇప్పుడు మూడోసారి ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బరిలోకి దింపుతున్నారు. అయితే గతానికీ, ఇప్పటికీ చంద్రగిరిలో పరిస్ధితులు పెద్దగా మారిందేమీ లేదు. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీ గెలుపు ఇక్కడ నల్లేరుగా నడకేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications