చంద్రబాబు చాణక్యం: పొత్తులపై మారిన TDP వ్యూహం
రాజకీయాల్లో చాణక్యుడిగా పేరుపొందిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పొత్తులపై తన వ్యూహాన్ని మార్చారు. ఇప్పటివరకు జనసేనతో పొత్తుకు సిద్ధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతమైన తర్వాత తన వ్యూహాన్ని మార్చుకుంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అర్థమవుతోందికానీ ఇంత తీవ్రస్థాయిలో ఉందని మహానాడుకు వచ్చిన జన ప్రభంజనాన్ని చూసిన తర్వాతే ఒక స్పష్టత వచ్చిందని చంద్రబాబునాయుడు అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.

మహానాడులో పొత్తుల ప్రస్తావనే లేదు!!
మహానాడు జరిగిన రెండు రోజుల్లోను పొత్తుల గురించి ఎక్కడా చంద్రబాబు ప్రస్తావించలేదు. ఇతర నేతలు కూడా తమ ప్రసంగాల్లో పొత్తుల గురించి మాట్లాడలేదు. ఎన్నికల సమయంలో మాత్రమే పొత్తుల గురించి మాట్లాడాలని తాజాగా చంద్రబాబు అన్నారు. జనసేన కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే.

పార్టీ బలోపేతమే ముఖ్యం
పొత్తుల విషయాన్ని పక్కనపెట్టి ముందుగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేం చేయాలని బాబు నాయకులందరికీ ఆదేశాలు జారీచేశారు. 35 నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్‌చార్జిలు లేరు. ముందు వారిని నియమించిన తర్వాత మహానాడు విజయం ఇచ్చిన ఊపును రెండు సంవత్సరాలపాటు కొనసాగించాలని నిశ్చయించారు. పొత్తుల విషయమై ఇప్పుడే మాట్లాడితే సీట్ల సంఖ్య, బలమైన స్థానాలను కోల్పావాల్సి రావడం, అధికారం పంచుకునే విషయంతోపాటు పలురకాల విషయాలను చర్చించాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి చంద్రబాబు ఆ విషయాన్ని వాయిదా వేశారు.

అటువైపు నుంచి కూడా స్పందన రావాలిగా!!
పొత్తుల గురించి అటువైపు నుంచి కూడా స్పందన రావాలని, స్పష్టత ఉండాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఈలోగా బాబు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. నాయకులంతా బలసమీకరణ చేయాలని ఆదేశించారు. ముందుగా ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఆయా జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. దీనికితోడు నారా లోకేష్ పాదయాత్ర కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఎన్నికలు జరిగే సమయం వరకు టీడీపీ నేతలంతా ప్రజల్లోనే ఉండబోతున్నారు. చివరగా మాత్రమే పొత్తుల విషయాన్ని మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.అప్పటివరకు పార్టీ బలోపేతమే టీడీపీ లక్ష్యంగా ఉంది.












Click it and Unblock the Notifications