దశాబ్దాల ఉద్దానం కిడ్నీ సమస్యకు చెక్: శాశ్వత పరిష్కారం చూపించిన ఏపీ సీఎం జగన్!!
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం.. ఈ పేరు చెప్పగానే అక్కడ ప్రజలను 40 ఏళ్లుగా పట్టిపీడిస్తున్న కిడ్నీ సమస్య అందరికీ గుర్తొస్తుంది. ఎంతోకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఉద్దానం ప్రజలు తమ సమస్యను పరిష్కరించే నాధుడే లేడని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక్కడ ఉన్న దాదాపు లక్ష మంది జనాభాలో 35 శాతం మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులే ఉండడం గమనార్హం.
మొత్తం 35 వేల మంది కిడ్నీ రోగులు ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం కోసం దశాబ్దాలు తరబడి ఎదురు చూస్తున్నారు. తాము మాత్రమే కాదు తమ భావితరాల వారి ఆరోగ్యం కోసం ఆందోళన చెందుతున్నారు. ఇక ఆ సమస్యకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిష్కారాన్ని తీసుకువచ్చి ఉద్దానం కిడ్నీ సమస్యకు చెక్ పెట్టారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం ఉద్దానం కిడ్నీ బాధితులకు భరోసా కల్పిస్తూ ఆ ప్రాంతానికి దాదాపు 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న హిర మండలం రిజర్వాయర్ నుంచి మెలియాపుట్టి శుద్ధి కేంద్రానికి మంచి నీటిని తరలించి తొలి దశ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసింది.
32 కిలోమీటర్ల పొడవున భూగర్భ పైప్లైన్ ద్వారా నీటిని తరలించి శుద్ధి కేంద్రానికి చేర్చారు. మొత్తం ఈ మార్గంలో 132 కిలోమీటర్ల మేర భూగర్భ పైప్లైన్ ను నిర్మించి ఉద్దానం చివరి ప్రాంతమైన ఇచ్చాపురం వరకు ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీటిని అందించడానికి అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే తొలి దశ ట్రయల్ రన్ సక్సెస్ కాగా 15 రోజుల్లో శుద్ధి కేంద్రం నుంచి ఉద్దానం చివరి ప్రాంతం వరకు నీటి తరలింపు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మొత్తం 700 కోట్ల రూపాయలతో ఉద్దానం కోసం సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, పలాస లోని దాదాపు ఏడు మండలాల పరిధిలో ఉన్న ఉద్దానం కు ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని సూచించి, అక్కడి ప్రజల కష్టాలకు విముక్తి కలిగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నం త్వరలోనే సక్సెస్ అవుతుందని, ఉద్దానం కిడ్నీ సమస్యకు చెక్ పడుతుందని అందరూ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications