చంద్రబాబుకు కొన్ని సూటి ప్రశ్నలు: జెండా సభలో జవాబు చెప్పాలి
TDP Janasena alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో జట్టు కట్టిన తెలుగుదేశం-జనసేన పార్టీలు సంయుక్తంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి. ఉమ్మడి బహిరంగ సభలకు శ్రీకారం చుట్టనున్నాయి.
ఈ నెల 28వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ సభలో ప్రసంగించనున్నారు. ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఈ సభకు జెండా అని పేరు పెట్టాయి ఈ రెండు పార్టీలు కూడా. తెలుగు జన విజయ కేతనం జెండా పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తామని వెల్లడించాయి.

ఈ సభ తలపెట్టిన నేపథ్యంలో- మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మరోసారి తెర మీదికి వచ్చారు. కాపు సామాజిక వర్గానికి బహిరంగ లేఖ రాశారు. కొన్ని కీలక అంశాలపై తన గళాన్ని విప్పారు. చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నలను సంధించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తోన్న అరచాక పాలనను అడ్డుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం- జనసేన కూటమి కట్టినప్పటికీ.. ఇందులో కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ పాత్ర ఏమిటనేది ఇంకా నిర్ధారణ కావట్లేదని, దీనిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని హరిరామ జోగయ్య అన్నారు.
ఈ మధ్య కాలంలో ఏర్పడిన రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశం పక్కదారి పట్టినట్టుగా కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాధికారంలో పవన్ కల్యాణ్ స్థానం ఏమిటనేది తేలాల్సి ఉందని స్పష్టం చేశారు.

బడుగు బలహీన వర్గాలు ఆశిస్తోన్న ప్రకారం వారి సంతృప్తి మేరకు అధికారాన్ని పంచుకోవడంలో పవన్ కల్యాణ్ పాత్ర ఏమిటో.. చంద్రబాబు పాత్ర ఏమిటో తెలియకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలంటూ హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు.
గౌరవమైన హోదాను పవన్ కల్యాణ్ దక్కించుకోవాలని అన్నారు. ఆ హోదాతో కెూడిన పదవి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సమాజంలో వారి గౌరవానికి తగ్గ నిర్ణయాలను తీసుకోగలిగిన సర్వాధికారాలు పవన్ కల్యాణ్‌కు చెందాలని చెప్పారు చేగొండి. ఈ ప్రశ్నలన్నింటికీ సంతృప్తికరమైన సమాధానం తెలుగుదేశం అధినేత ద్వారా తాడేపల్లిగూడెం సభకు హాజరయ్యే ప్రజల్లో కలగాలని పేర్కొన్నారు.
దీనికి సరైన సమాధానం కోసం బడుగు, బలహీనవర్గాల క్షేమం కోరే ప్రతినిధులలో ఒకడిగా తాను సమాదానం కోసం ఎదురు చూస్తోన్నానని హరిరామ అన్నారు. లేకపోతే బడుగు బలహీన వర్గాలు కోరుకునే రాజ్యాధికారం కోసం ఈ నెల 29వ తేదీన తాను కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications