చెన్నైలో చిక్కుకున్న విద్యార్థులు: చెరువులా ఆలయం... మోకాలి లోతు నీటిలో పూజ
హైదరాబాద్: చెన్నైలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలం అవుతోంది. చెన్నై నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నైలో ఉంటున్న తెలుగు విద్యార్థులు వరద నీటిలో చిక్కుకున్నారు.
భారీ వర్షాల కారణంగా చెన్నై మూడొంతులు నీట మునిగింది. రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ఎన్నో ప్రాంతాలు నీట మునిగాయి. కారాబకం, ఐఏఎస్, ఐపీఎస్ కాలనీలో తెలుగు విద్యార్థినులు వరద నీటిలో చిక్కుకున్నారు. శ్రీ వెంకటేశ్వర లేడీస్ పిజి కళాశాల భవనం వద్ద మొదటి అంతస్తులోకి భారీగా వరద నీరు చేరింది. వారు ఎదురు చూస్తున్నారు.
చెన్నైలో భారీ వర్షాల నేపథ్యంలో నగర వాసులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలు, పాలు, నీరు దొరకక ఆవురావురుమంటున్నారు. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
హాస్టల్‌లో ఉంటూ చెన్నై శివారుల్లోని ఓ పాఠశాలలో చదువుకుంటున్న వందమంది పిల్లలు వర్షాలకారణంగా ఆకలితో అలమటిస్తున్నారు. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు వారి పాఠశాల చుట్టూ నీరు చేరడంతో దాదాపు వందమంది వినికిడిలోపం గల పిల్లలు, ఉపాధ్యాయులు ఆ పాఠశాలలోనే చిక్కుకుపోయారు.
వారుండే హాస్టల్ వంటింట్లోకి సైతం గత సాయంత్రం భారీగా నీరు చేరాయి. దీంతో వంట చెయ్యడానికి కూడా కుదరక వారంతా పస్తులు ఉంటున్నారు. పాఠశాలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఇళ్లు, వాహనాలు, ఇతర భవానాల్లో చిక్కుకుపోయిన ప్రజల్ని నేవీ, ఆర్మీ అధికారులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

చెన్నైలోని అడయార్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో సైదాపేట్ వంతెనను అధికారులు మూసివేశారు. నీరు వంతెనను తాకుతూ ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. మరోవైపు, ఏపీని కూడా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. రెండు రోజులుగా ఎస్పీఎస్ నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు - చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
చెరువును తలపిస్తున్న ఆలయ ప్రాంగణం
భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలోని చారిత్రక వేదనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం చెరువును తలపిస్తోంది. ఆలయానికి బాగా వరద పోటు కనిపిస్తోంది. మోకాళ్ళ దాకా నీరు వస్తోంది. అయినప్పటికీ పూజారులు పూజలు నిర్వహించారు. దీనిని టిటిడి తన ఆదీనంలోకి తీసుకుంది.












Click it and Unblock the Notifications