నాని బండారం బయటపెట్టిన చెవిరెడ్డి
Chevireddy Bhaskar Reddy: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. ధీమాగా ఉంటోన్నాయి. ఆ ధీమాతోనే ఆయా పార్టీల అధినేతలు విదేశీ పర్యటనల్లో ఉంటోన్నారు.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

పోలింగ్ రోజు, ఆ తరువాతా అల్లర్లతో కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి- పల్నాడు జిల్లా మాచర్ల, చిత్తూరు జిల్లా చంద్రగిరిల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం నాయకులు దాడులు- ప్రతిదాడులకు దిగారు.
దీనిపై వైఎస్ఆర్సీపీకి చెందిన చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒంగోలు లోక్‌సభ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. ఈ అల్లర్లల్లో తన ప్రమేయం ఉందంటూ తెలుగుదేశం నాయకులు చేస్తోన్న ఆరోపణలను కొట్టిపారేశారు. అవాస్తవం వాళ్లు ప్రచారం చేస్తోన్నారని విమర్శించారు. బట్ట కాల్చి ముఖం మీద వేస్తోన్నారని ధ్వజమెత్తారు.
తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాడినని, అయిదేళ్లుగా టీడీపీ నాయకులు తనపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజు కూడా తాను ప్రతివిమర్శ చేయలేదని గుర్తు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర చేసినా, భువనేశ్వరి పర్యటించినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు.
సొంత బావమరిదిపై టీడీపీ ఇన్‌ఛార్జి పులివర్తి నాని చేయి చేసుకున్నాడని, నామినేషన్ రోజు తన కారుపై దాడి చేశారని చెప్పారు. పోలింగ్ రోజున మోహిత్ కారు దగ్ధం చేశారని, తమ పార్టీకి చెందిన సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారని పేర్కొన్నారు. పులివర్తి నాని, ఆయన భార్య సుధారెడ్డి ప్రతి రోజూ తనను తిడుతూ విష ప్రచారం చేస్తోన్నారని, అయినా తాను కేసు పెట్టలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
పులివర్తి నాని, ఆయన కుటుంబం, టీడీపీ నాయకులు, కార్యకర్తలను తాను రాజకీయ ప్రత్యర్థులుగానే చూశాను తప్ప, వ్యక్తిగత శత్రువులుగా ఏనాడూ భావించలేదని వ్యాఖ్యానించారు. తప్పుడు ఆరోపణలు, విమర్శలపై జూన్ 4వ తేదీన చంద్రగిరి ఓటర్లు సరైన తీర్పు ఇస్తారని చెవిరెడ్డి అన్నారు.
స్విమ్స్‌లో పేషెంట్‌ను చూడటానికి వచ్చిన బంధువులపైనా టీడీపీ నాయకులు దాడి చేశారని ధ్వజమెత్తారు. దాడి జరిగినప్పుడు నాని చాలా యాక్టీవ్‌గా ఉన్నాడని, రెండు గంటల తరువాత వీల్ చైర్‌లో కూర్చుని డ్రామాలు ఆడాడని చెవిరెడ్డి విమర్శించారు. పులివర్తి నాని భార్య సుధారెడ్డి చిత్తూరు మహానటిగా నటించారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications