చంద్రబాబుకు చికాగో వర్సిటీ డాక్టరేట్: తొలి విదేశీ నేతగా రికార్డు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక చికాగో యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ డాక్టరేట్ ప్రకటించినట్లు యూనివర్సిటీ ప్రకటనలో పేర్కొంది.
చంద్రబాబు నాయుడుకు దార్శనికత, అసాధరాణమైన ప్రతిభా సామర్థ్యాలు, సంస్కరణా దృక్పతం ఉన్నాయని ఈ సందర్భంగా యూనివర్సిటీ కొనియాడింది. 1867 ఏర్పాటైన చికాగో యూనివర్సిటీ ఒక విదేశీ నేతకు డాక్టరేట్ ప్రకటించిడం ఇదే మొదటిసారి.

కాగా, చికాగో వర్సిటీ డాక్టరేట్ ప్రకటించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. గతంలో ఎన్నో యూనివర్శిటీలు తనకు గౌరవ డాక్టరేట్ ఇస్తామని ముందుకు వచ్చాయని, అయితే, వాటన్నింటిని తాను సున్నితంగా తిరస్కరించానని ఆయన చెప్పారు.
చికాగో యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను తాను అంగీకరించడానికి ఆ వర్శిటీకి ఉన్న చరిత్రను చూసి, సంబంధాలు మెరుగుపడతాయని భావించి అందుకు ఒప్పుకున్నానని చెప్పారు. చికాగో యూనివర్సిటీ అక్కడి ప్రభుత్వంతో నడపబడుతోన్న ప్రతిష్టాత్మక సంస్ధ అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి ఈ డాక్టరేట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే తనకు ముఖ్యమని, వారి గుర్తింపే తనకు డాక్టరేట్లు అని చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications