కలెక్టర్ చొరవతో ఆ ఉద్యాన రైతులకు సీఎం చంద్రబాబు తీపికబురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులకు తీపి కబురు చెప్పింది. ముఖ్యంగా పైనాపిల్ పంట సాగు చేస్తున్న ఉద్యాన రైతులకు ఏపీ ప్రభుత్వం చెప్పిన కబురు సంతోషం కలిగిస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీ గ్రామంలో పైనాపిల్ సాగు చేస్తున్న గిరిజన రైతులకు సరైన మద్దతు ధర లభించని పరిస్థితి ఉంది.
ఆ రైతుల కోసం చంద్రబాబు నిర్ణయం
పండించిన పంటను నిల్వ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో రైతులు పంటను దళారులకు తక్కువ ధరకు అమ్మి తీవ్ర నష్టాలను చూడాల్సి వస్తుంది. ఇక ఈ సమస్యను చంద్రబాబు దృష్టికి కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తీసుకువెళ్లారు. దీంతో సీఎం చంద్రబాబు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన ఉద్యాన రైతులకు నష్టం కలగకుండా కీలక నిర్ణయం తీసుకున్నారు.

రైతులకు గిట్టుబాటు ధర కోసం కొత్త ప్రతిపాదన.. చంద్రబాబు సానుకూలం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పైనాపిల్ సరఫరాకు అనుమతినివ్వాలని, ఇది రైతులకు మంచి గిట్టుబాటు ధరను ఇవ్వడంతో పాటు విద్యార్థులకు పోషక విలువలు ఉన్న పండ్లను అందిస్తుందని కలెక్టర్ కోరగా, .కలెక్టర్ ప్రతిపాదనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ అనుమతి రాగానే పైనాపిల్ రైతుల కష్టాలు తీరుతాయని వారికి ఆర్థిక భరోసా కలుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
స్కూల్స్ విద్యార్థులకు పైనాపిల్
పాఠశాలల విద్యార్థులకు పైనాపిల్ సరఫరా చేయడం వల్ల వారికి కూడా మంచి పోషకాహారం లభించినట్టు అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న 116 సంక్షేమ హాస్టళ్లు, విద్యాసంస్థల్లో సుమారు 30 వేల మంది పిల్లలు, 1447 ప్రభుత్వ పాఠశాలల్లో 98 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పిల్లలందరికీ పైనాపిల్ సరఫరా చేయడం ద్వారా సీజనల్ పంటలు ఎక్కువ భాగాన్ని అక్కడ వినియోగించవచ్చు అని భావిస్తున్నారు.
సీతంపేట పైనాపిల్ రైతుల కోసం చంద్రబాబు నిర్ణయం
దళారుల మోసాల నుంచి రైతులను కాపాడవచ్చని, గిట్టుబాటు ధర లభించడంతో రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీతంపేట ఐటిడిఏ ప్రాంత రైతులు సేంద్రీయ పద్ధతిలో 7,322 ఎకరాలలో పైనాపిల్ ను పండిస్తున్నారు. ఎకరాకు సుమారు ఆరు టన్నుల దిగుబడి వీరికి వస్తుంది. ఈ పంటను రైతులు సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక అరా కొరకు అమ్ముకుంటున్న పరిస్థితులలో చంద్రబాబు ఈ రైతులకు ఆర్థిక భరోసా కల్పించేలా నిర్ణయం తీసుకోవడం హర్షనీయం.












Click it and Unblock the Notifications