చంద్రబాబుకు ఇల్లు దొరికింది! 'అనుమతి'పై అనుమానాలు

అమరావతి: సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉండేందుకు కృష్ణా తీరంలో భవనాన్ని ఎంపిక చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధి అమరావతి కరకట్ట మార్గంలో 1.30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లింగమనేని ఎస్టేట్‌ అతిథి గృహాన్ని గుర్తించారు.

ప్రకాశం బ్యారేజీకి రెండు కిలోమీటర్ల దూరంలో అమరావతి కరకట్ట వెంట కృష్ణానది ఒడ్డునే ఈ గెస్ట్ హౌస్ ఉంది. రెండంతస్తులుగా ఉన్న ఈ భవనంలో విశాలమైన రెండు గదులు, పడక గదులు, హోంథియేటర్‌తో పాటు అతిథులకు కూడా అనువుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సీఎంకు వివరాలు తెలిపారు.

సీఎం నుండి సానుకూల స్పందన రావడంతో గుంటూరు కలెక్టర్‌ కాంతిలాల్ దండే, ముఖ్యమంత్రి భద్రతాధికారులతో కలిసి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ వీరపాండ్యన్‌, సీఎం వ్యక్తిగత వాస్తు నిపుణులు, రహదార్లు భవనాల శాఖ, రెవెన్యూ, విద్యుత్‌ అధికారులు భవనాన్ని పరిశీలించారు.

వాస్తు నిపుణల సూచన మేరకు కొన్ని పనులను చేపట్టనున్నారు. ప్రస్తుతం భవనంలోకి తూర్పు ఆగ్నేయం గుండా ప్రవేశిస్తున్నారు. ఇలాకాకుండా తూర్పు ఈశాన్యం గుండా నివాస గృహంలోకి ప్రవేశించేలా రహదారి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి వాహనం రివర్స్‌ చేసే పని లేకుండా భవనం ఎదురుగా రింగ్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కరకట్టపై ఉంటే ముఖ్యమంత్రి నివాస గృహం కనిపించే అవకాశం లేనందున భద్రత పరంగా కూడా అనువుగా ఉంటుందని భావిస్తున్నారు.

భవనం లోపలి భాగాన్ని తీర్చిదిద్దేందుకు రూపశిల్పులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని వచ్చేనాటికే ముఖ్యమంత్రి నివాసగృహాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. నెల రోజుల్లో ఈ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి సూచించారని తెలుస్తోంది.

 Chief Minister residence near Krishna river

ప్రస్తుతం ఈ గెస్ట్‌హౌస్‌కు వెళ్లేందుకు కేవలం 12 అడుగుల మట్టిరోడ్డు మాత్రమే ఉంది. దాన్ని డబుల్ రోడ్డు చేయాలని అధికారులు నిర్ణయించారు.

ముఖ్యమంత్రి నివాసగృహం నుంచి రాజధాని ప్రాంతం వరకు వెళ్లేందుకు అనువుగా రింగురోడ్డు కూడా వేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. భద్రతకు అనువుగా ఉందో, లేదో గమనించేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు.

కరకట్టపై వున్న 23 గెస్ట్‌హౌస్‌లలో ముఖ్యమంత్రి నివాస గృహానికి లింగమనేని గెస్ట్‌హౌస్ పోగా, మిగిలిన వాటిలో కొన్నింటిని భద్రతా అధికారులు ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. కృష్ణా నది ఒడ్డునే నివాసగృహం ఉన్నందున నది లోపల కూడా 24గంటలూ భద్రతను కట్టుదిట్టం చేసే యోచనలో ఉన్నారు.

సుమారు ఎకరం 30 సెంట్ల స్థలంలో ఈ గెస్ట్‌హౌస్ వుంది. విద్యుత్, ఆర్ అండ్ బి, ఆర్‌డబ్ల్యుఎస్, పోలీసు, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు గెస్ట్‌హౌస్‌ను పరిశీలించారు. జడ్ ప్లస్ కేటగిరి అధికారులు కూడా భద్రత దృష్ట్యా అనుకూలతలను పరిశీలించారు.

కరకట్ట ప్రాంతం నుంచి అమరావతి వెళ్లేందుకు గతంలోనే రహదారి ఉంది. ఈప్రాంతం నుంచి అమరావతికి దూరం కేవలం 36 కిలోమీటర్లు మాత్రమే. తుళ్లూరు మీదుగా అమరావతికి ప్రయాణం చేయాల్సిన పక్షంలో 50 కిలో మీటర్ల రోడ్డుమార్గం ఉంది.

ముఖ్యమంత్రి నివాసం ఏర్పర్చుకున్న పక్షంలో రాజధాని రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. తద్వారా రైతుల సందేహాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి నివృత్తి చేసేందుకు అవకాశాలు మెరుగవుతాయి. భూసమీకరణ విధానంలో గెస్ట్‌హౌస్‌కు సమీపంలో కొందరు ఉండవల్లి రైతులు భూములిచ్చారు.

అనుమానాలు

చంద్రబాబు నివాసం కోసం అతిథి గృహాన్ని ఎంపిక చేసిన తీరుపై సందేహాలు వస్తున్నాయి. నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించినట్టు గతంలో అధికారులు గుర్తించిన భవనాన్ని ఎంపిక చేయడం సరైనదేనా అని అనుమానాలు వస్తున్నాయి.

తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో, ప్రకాశం బ్యారేజీకి 3.2 కిలోమీటర్ల దూరంలోని ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన లింగమనేని ఎస్టేట్‌ అతిథిగృహం అనువైనదిగా అధికారులు గుర్తించి ప్రతిపాదించారు.

కృష్ణా నది గర్భంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టడం నదీ పరిరక్షణ చట్టానికి (రివర్‌ కన్జర్వేషన్‌ యాక్టు-ఆర్‌.సి.చట్టం) వ్యతిరేకం. గత ఏడాది డిసెంబరు 31న మీడియాతో కలిసి నదిలో ప్రయాణించి ఇలాంటి నిర్మాణాలను చూసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ విషయాన్ని స్పష్టం చేశారు కూడా.

అనుమతులు లేకుండా నదిలో జరిగిన నిర్మాణాల సంగతి తేల్చేస్తామని, నిర్మాణదారులకు తాఖీదులు జారీ చేస్తామని హెచ్చరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ఉన్న అన్ని రకాల నిర్మాణాలపై సర్వేచేసి, నివేదికలు రూపొందించి నిగ్గు తేల్చాలని తన శాఖను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+