ఆలయాలపై దాడులు:జగన్ సర్కారుకు చినజీయర్ సూచన - డిక్లరేషన్‌పై సీఎంను సమర్థించినా..
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఆలయాలపై వరుస దాడులు, అనూహ్య ఘటనలు చోటుచేసుకోవడంపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరడం, దళితులు, ఆలయాలపై దాడులకు సంబంధించి ఏవైనా ఆధారాలుంటే బయటపెట్టాలంటూ రాష్ట్ర డీజీపీ ప్రతిపక్ష నేతకు లేఖ రాయడం తదితర పరిణామాలతో వివాదాలు మరింత పెద్దవవుతున్న నేథ్యంలో మత గురువులు జోక్యం చేసుకోవాలని, దాడుల ఘటనలపై మఠ, పీఠాదిపధులు స్పందించాలనే చర్చ సాగుతున్నది. ఈ క్రమంలోనే..

చినజీయర్ స్పందన..
ఏపీలో ఆలయాలపై దాడులు, దొంగతనాల ఘటనలపై త్రిదండి చినజీయర్ స్వామి స్పందించారు. విశాఖపట్నం జిల్లాలోని ప్రఖ్యాత సింహాచలం అప్పన్న ఆలయ సందర్శనకు వచ్చిన ఆయన.. స్థానిక మీడియాతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వరుస ఘటనలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు చినజీయర్ బదులిచ్చారు. తల్లి చనిపోయిన తర్వాత తొలిసారి ఆలయానికి వచ్చిన చినజీయర్ కు సింహాచలం ఆలయం ఈవో పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

ఆలయాలపై దాడులు దేశానికే నష్టం..
దేవాలయ సంపదను ఎవరు నాశనం చేసినా, అది జాతికి, దేశానికి నష్టమేనని త్రిదండి చినజీయర్ అన్నారు. ఆలయాలపై ఎవరు దాడులు చేసినా తప్పేనని, అలాంటి వాళ్లను ప్రభుత్వం అణిచివేయాలని ఆయన సూచించారు. ఘటనలను పునవృతం కాకుండా ఉండాలని ఆకాంక్షించారు. సింహాద్రి అప్పన్న సందర్శన కోసం వచ్చిన ఆయన.. భక్తుల అవసరాల కోసం అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను కోరారు. కాగా, వారం కిందట..

జగన్‌పై జీయర్ ప్రశంసలు
తిరుమల డిక్లరేషన్ వివాదంపై గడిచిన రెండు వారాల్లో నేతల మధ్య తీవ్రస్థాయి మాటల యుద్ధం కొనసాగిన దరిమిలా చినజీయర్.. సీఎం జగన్ ను సమర్థించడం తెలిసిందే. జగన్ ఏ పని చేసినా నిండు హృదయంతో చేస్తారని, ఆయన తిరుమల దర్శనం వల్ల హిందూ మతానికి ఎనలేని మేలు జరుగుతుందని జీయర్ ప్రశంసించారు. అంతేకాదు, తిరుమలేశుడు తనే తనకిష్టమైన వారిని రప్పించుకుంటారని, వేంకటేశ్వరస్వామి మీద నమ్మకం ఉంచితే అంతా మంచే జరుగుతుందని పేర్కొన్నారు. డిక్లరేషన్ వివాదంలో జగన్ కు సంపూర్ణ మద్దతు పలికిన జీయర్.. ఆలయాలపై దాడుల విషయంలో చేయాల్సిన బాధ్యతను గుర్తుచేయడం గమనార్హం. ఇదిలా ఉంటే,
Recommended Video

దాడులకు వ్యతిరేకంగా హోమం
ఆలయాలపై వరుస దాడుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి.. విశాఖపట్నంలో బుధవారం శాంతి యజ్ఞం తలపెట్టారు. కొన్నాళ్లుగా దేవాలయాల్లో అపచారం జరుగుతోందని, ఈ ఘటనపై ఎండోన్మెంట్ శాఖ అరిష్ట నివారణ శాంతి హోమాలు చేయాల్సి ఉందని, ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో తామే హోమాన్ని తలపెట్టామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications