తిరుపతి మాజీ ప్రజాప్రతినిధిగా...: కిరణ్‌కు చిరంజీవి లేఖ
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి శనివారం లేఖ రాశారు. శ్రీవారి భక్తుల ఆందోళనలు తొలగించాలని కోరారు. ఎర్రచందనం స్మగ్లర్లు పెట్రేగిపోతున్నారని, తిరుమల - తిరుపతిలలో పటిష్ట రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
కలిగయుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిని తిరుమలలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, పర్యవసానంగా స్థానికలలో, భక్తులలో భయాందోళన వ్యక్తమవుతోందని చిరు లేఖలో పేర్కొన్నారు. వారి అపోహల్ని తొలగించాలని ముఖ్యమంత్రిని కోరారు.

తిరుపతికి కొన్నేళ్ల కిందట ప్రాతినిథ్యం వహించిన ఒక ప్రజాప్రతినిధిగా, ప్రస్తుతం చిత్తూరు జిల్లాను నోడల్ జిల్లాగా చేసుకున్న రాజ్యసభ సభ్యునిగా ఈ అంశాలను చెబుతున్నానని సిఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. శేషాచలం అడవులలో ఎర్రచందనం స్మగ్లర్లు కొంతకాలంగా సాగిస్తున్న అరాచకాలు తారాస్థాయికి చేరుకుననాయని, వారి చేతుల్లోనే ఇద్దరు అటవీశాఖ అధికారులు ప్రాణాలు కోల్పోవడం అందర్నీ నిశ్చేష్టులను చేసిందన్నారు.
పుణ్యక్షేత్రం ఉన్న ప్రాంతంలో స్మగ్లర్ల అరాచకాలకు తక్షణం కళ్లెం వేయాలన్నారు. శతాబ్దాలుగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న తిరుపతి.... లేనిపోని వివాదాలకు కేంద్రంగా మారడం సమంజసం కాదన్నారు. ఇక్కడ ఇస్లామిక్ వర్సిటీ స్థాపనపై కొనసాగుతున్న వివాదం, ఈ అంశాన్ని తమ రాజకీయ స్వలాభం ఉపయోగించుకోవాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలపై స్పందించాలని కోరారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు.












Click it and Unblock the Notifications